వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ, ఆ పార్టీ అంతర్గతంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుగా కీలక భూమిక పోషించిన ఆయన, ఇప్పుడు పార్టీని తన చేతుల్లోనే ఉంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల పాత్ర ఉన్నట్టు పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
తాజాగా, సజ్జల తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి కీలక టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం పార్టీ లోపలే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కమిటీల భర్తీపై ఆదేశాలు ఇచ్చిన సజ్జల, కీలక నేతలందరికీ టాస్క్ అప్పగించారు. జగన్ అందుబాటులో లేని సమయంలో సజ్జలనే అన్నీ తానై వ్యవహరించడంపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
గతంలో పార్టీని విజయపథంలో నడిపించిన నేతలకన్నా, ఇప్పుడు వేరే వ్యక్తులే అధికారం వహిస్తున్నారన్న భావన పార్టీ నేతల్లో పెరుగుతోంది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ నేతృత్వం గణనీయమైన మార్పును అనుసరిస్తుందా లేక సజ్జల వర్గమే పాలనను కొనసాగిస్తుందా? అన్నది పార్టీ భవిష్యత్తును నిర్ణయించనున్నది. జగన్ 151 నుంచి 11 స్థానాలకు పరిమితమైనా, తన చుట్టూ ఉన్న వ్యక్తుల తీరును మార్చుకుంటారా లేదా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ప్రస్తుతం సజ్జల నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సులు చూస్తుంటే, ఆయన తన హవాను కొనసాగించేందుకు మరింత గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల నిర్వహించిన ఫీజు పోరాటాన్ని విజయవంతం చేశారని పార్టీ శ్రేణులను అభినందించిన తీరూ, సజ్జల తన ప్రభావాన్ని కొనసాగించాలనే ప్రణాళికలో ఉన్నారనే సంకేతాలనిస్తోంది. ఇదిలా ఉండగా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా, పలువురు సీనియర్ నేతలు సజ్జల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నేరుగా సజ్జల పేరును ప్రస్తావించకున్నా, జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీ నష్టపోయిందని వారు బహిరంగంగానే పేర్కొన్నారు.