స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు గత 45 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషంపై తీర్పు నవంబర్ 8కి వాయిదా పడింది. అది క్వాష్ అయితే బాబు ఈ కేసువరకూ ఆల్ మోస్ట్ బయటకు వచ్చేసినట్లే! సపోజ్ క్వాష్ ను సుప్రీం కొట్టివేస్తే మాత్రం బాబుకు ఇప్పట్లే అవకాశం లేదనే అనుకోవాల్సిన పరిస్థితి! ఈ సమయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు బయటకు వచ్చినా, రాకున్నా ఎన్నికలైతే ఆగవు కాబట్టి… ఇక టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేయాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… చంద్రబాబు అరెస్ట్ తో నంద్యాలలో ఆగిపోయిన “భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమాన్ని నారా లోకేష్ ప్రారంభిస్తుండగా… బాలయ్య చేయాలనుకున్న ఓదార్పు యాత్రకు “నిజం గెలవాలి” అని పేరు పెట్టి భువనేశ్వరి చేస్తున్నారు. ఇది ఈరోజు నుంచి ప్రారంభమవబోతున్న బస్సు యాత్ర.
ఇలా “నిజం గెలవాలి” అంటూ నారా భువనేశ్వరి నేటి నుంచి బస్సు యాత్ర మొదలుపెడుతున్నారు. ఈ యాత్రపై వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. తాము కూడా “నిజం గెలవాలి” అనే కోరుకుంటున్నామని, అదే జరిగితే బాబు బయటరకు రావడం సంగతి అటుంచితే.. లోకేష్, భువనేశ్వరి కూడా లోపలికి వెళ్తారని కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈనెల 26నుంచి వైసీపీ కూడా బస్సుయాత్ర మొదలు పెడుతోంది.
ఈ యాత్రపేరు “సామాజిక సాధికార యాత్ర”‘. ఇందులో భాగంగా వైసీపీ నుంచి మూడు బస్సులు ఈనెల 26న రోడ్డెక్కుతాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మూడు బస్సులు ఒకేసారి ప్రయాణం ప్రారంభిస్తాయి. నిజం గెలవాలి యాత్రకంటే ముందే షెడ్యూల్ ఫిక్స్ అయిన సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు పాల్గొంటారని స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు.
ఒకేసారి మూడు ప్రాంతాల్లో ఈ సామాజిక సాధికార యాత్ర పర్యటన కొనసాగించేందుకు వీలుగా.. ఆయా ప్రాంతాల మంత్రులకు ప్రయారిటీ ఇవ్వడం కోసం యాత్రను ఇలా ప్లాన్ చేశారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. మరోపక్క నిజం గెలవాలి కూడా నడుస్తుంటుంది. ఏ యాత్రకు ఎలాంటి ఆదరణ ఉండబోతుందనేది వేచి చూడాలి. ఆ ఆధరణ కూడా చంద్రబాబు అరెస్ట్ వ్యవహ్హారంపై ప్రజల రియాక్షన్ పై ఒక క్లారిటీ ఇవ్వొచ్చని అంటున్నారు.
ఇక టీడీపీ బస్సుపై చంద్రబాబు, భువనేశ్వరి బొమ్మలున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు ఆవారణలో చంద్రబాబు కూర్చుని ఉన్న ఫోటో అది! ఇక ఎన్నికల సీజన్ కావడంతో యాజ్ యూజువల్ గా ఎన్టీఆర్ ఫోటోకి కూడా చోటు కల్పించారు. ఇక వైసీపీ బస్సు ముందు భాగంలో ఫ్యాన్ గుర్తు ప్రముఖంగా కనపడుతుంది. మిగతా మూడు వైపులా “మా నమ్మకం నువ్వే జగన్” పేరుతో స్టిక్కర్లు అంటించారు. జగన్ ఫొటోతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని ప్రమఖుల చిత్రాలను బస్సు మీద ఏర్పాటు చేశారు.
ఈ బస్సులో ఈనెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాల నుంచి బయలుదేరుతాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్రలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు ప్రజలకు వివరిస్తారు. ఇందులో భాగంగా… ప్రతి రోజు రెండుచోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రాబోయే ఎన్నికల ప్రచారాలకు ఇది ఫ్రీ ఫైనల్ అని అంటున్నారు పరిశీలకులు.