గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.4,000 కోట్లకు చేరాయని, ఇంత భారీగా బకాయిలు పెట్టిన వైసీపీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతోందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
4 వేల కోట్ల బకాయిలు, 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం: గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.4,000 కోట్లకు చేరాయని మంత్రి లోకేశ్ సభకు తెలిపారు. కోవిడ్ సమయంలో రూ.644 కోట్లు, ఆర్టీఎఫ్ కింద రూ.3,000 కోట్లు, ఎంటీఎఫ్ కింద మరో రూ.895 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేశామని, మిగిలిన రూ.1,400 కోట్ల బకాయిలను రాబోయే మూడు నెలల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆరోపించారు.
రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ: టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్
ప్రతిపక్ష హోదాపై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణపై లోకేశ్ విరుచుకుపడ్డారు. బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తమ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే అక్కడ ఈ విషయం లేవనెత్తలేదని ఆరోపించారు. విద్యా రంగంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. గతంలో విద్యా రంగంపై చర్చ జరుగుతుంటే బొత్స సహా ఇతర వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సభలో పరుషపదాలు వాడొద్దని బొత్స సత్యనారాయణ సూచించగా, తాను ఎవరినీ అగౌరవపరచలేదని, “బొత్స గారు” అనే సంబోధించానని లోకేశ్ బదులిచ్చారు. తాను వాడిన పరుషపదజాలం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను అందరినీ గౌరవిస్తానని, ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

