151 మంది ఎమ్మెల్యేలు,22 మంది ఎంపిల ఘన విజయంతో 2019 ఎన్నికల్లో వైసిపి చారిత్రాత్మక గెలుపు సొంతం చేసుకుంది. తద్వారా తిరుగులేని నేతగా అవతరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా అత్యంత సౌఖ్యవంతమైన స్థితిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన పాలనలో రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని, అలాగే తాను మాట ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని సిఎం పగ్గాలు చేపట్టాక అటు పార్టీకి, ఇటు ప్రజలకు జగన్ స్పష్టం చేశారు. ఆ ప్రకారమే ముందుకు కొనసాగుతున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో విమర్శించాలని విమర్శించే ప్రధాన ప్రతిపక్షం టిడిపినే తప్ప మరెవరూ వేలెత్తి చూపని విధంగా జగన్ ముందుకు సాగిపోతున్నారు. అయితే అవినీతి రహిత పాలన విషయమై సిఎం జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారా?..లేదా?…అనే ప్రశ్న ఇటీవలి కాలంలో వైసిపి శ్రేణుల నుంచే ఎదురవుతుండటం ఆసక్తికరంగా మారింది.
వైసిపి శ్రేణుల్లో అసంతృప్తి
జగన్ తాను సిఎం పదవి చేపట్టిన వెంటనే అవినీతిని సహించేది లేదంటూ చేసిన ప్రకటన కొందరు వైసిపి ప్రజాప్రతినిథులకు రుచించలేదట. ఎన్నికల్లో గెలవడానికి తాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టామని…అసలు అవినీతి అనేదే ఉండరాదని అంటే మరి తాము పెట్టిన ఖర్చు తిరిగివచ్చేది ఎలా ? వచ్చే ఎన్నికలకు సంసిద్దం అయ్యేదెలా?…అంటూ అంతర్గత చర్చల్లో ఆవేదన చెందారట. సరే ఇప్పటికిప్పుడు కాకపోయినా తరువాత పరిస్థితులు మారకపోతాయా?…అనే ఆశాభావంతో నిరీక్షణకు సిద్దమయ్యారట. పాలన అన్నాక ప్రతిపక్షాలు ఏదో ఒక విషయంలో అవినీతి అంటూ రచ్చ చేయకమానవు. ఆ విధంగానే ప్రధాన ప్రతిపక్షం టిడిపి పలు సందర్భాల్లో అవినీతి జరుగుతోందంటూ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా సిఎం జగన్ వ్యవహరించేవారు. అయితే ఇటీవలి కాలంలో సొంత పార్టీ నేతలు, శ్రేణుల నుంచే తమ ప్రజాప్రతినిథుల అవినీతిపై ఫిర్యాదులు, ఆరోపణలు,విమర్శలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కారణం అదేనా?
ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కొంత కాలం సిఎం జగన్ ఆకాంక్ష మేరకు అవినీతి రహిత పాలనకు సహకరించిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆ తరువాత క్రమంగా తమ చేతివాటం చూపించడం మొదలుపెట్టేశారని ఆ పార్టీ వారే విమర్శలు చేస్తుండటం గమనార్హం. పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ వైసిపి ఎంపీ ప్రస్తుతం రెబెల్ గా మారిన రఘురామకృష్ణం రాజు సంచలన ఆరోపణలతో తెరతీశారు. అలాగే ఆ తరువాత ఇసుక తవ్వకాల విషయమై అవినీతికి పాల్పడుతున్నట్లు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి-బాపట్ల ఎంపి నందిగం సురేష్ అనుచరులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై పేకాట నిర్వహణకు సంబంధించి విమర్శలు రాగా దానితో తనకు సంబంధం లేదని, ఇదో కుట్ర అని ఆమె వివరణ ఇచ్చారు.అలాగే కర్నూలులో స్వయాన మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడే పేకాట నిర్వహణ కేసులో అరెస్ట్ కావడం సంచలనం సృష్టించగా, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై స్థానిక వైసిపి నేతే కోర్టులో కేసు వేయడం ప్రకంపనలు రేపింది. తాజాగా తిరుపతిలో విచిత్రమైన రీతిలో కర్నూలులో భూ అక్రమాలు అంటూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అవ్వగా, ఆయన సోదరుడు భూమన్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఘోరాలు. పట్టించుకోకపోతే పార్టీకి నష్టం అంటూ గంగిరెడ్డిపై సిఎంకే బహిరంగ విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వైసిపి శ్రేణుల ఆవేదన ఇది…
ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడిన తమని కాదని వైసిపి ఎమ్మెల్యేలు గతంలో టిడిపి హయాంలో ఎవరైతే పనులు, కాంట్రాక్టులు, దందాలు చేశారో వారికే ప్రాధానత్య ఇస్తున్నారని వాపోతున్నారు. ఇప్పుడు తమ ఎమ్మెల్యేల వద్ద ఎప్పుడు చూసినా వారే ఉంటున్నారని, తమని పట్టించుకోవడం అటుంచి అసలు లెక్కచేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో సొమ్ములు గడించిన టిడిపి వారి నుంచి లబ్ది పొంది తమను పక్కనపెట్టి పనులైనా,పదవులైనా వారికే కట్టబెడుతున్నారని బోరుమంటున్నారు. దీంతో అవినీతి పెరగడంతో పాటు పార్టీ దిగువ శ్రేణి నాయకులకు అన్యాయం జరుగుతోందని…ఫలితంగా సిఎం జగన్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని వారంటున్నారు. అందుకే సిఎం జగన్ ఈ వ్యవహారాలపై దృష్టి సారించి పరిస్థితి చక్కదిద్దాలని సోషల్ మీడియా వేదిక చేసుకొని సిఎం జగన్ ను వేడుకుంటున్నారు.