వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను “అవినీతిలో అనకొండ”గా అభివర్ణిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో ఆమె సాగించిన అక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీ ముఖ్య నేత ఒకరు గత ప్రభుత్వంలోని కీలక అధికారిపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన, “రెండు సంవత్సరాలుగా నా మనసులో ఉన్న ఆవేదనను ఇప్పుడు బయటపెడుతున్నా” అంటూ శ్రీలక్ష్మిపై విమర్శల వర్షం కురిపించారు. “గతంలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారిణి అవినీతిలో అనకొండ లాంటి వారు. మంత్రులను కూడా పూచికపుల్లలా చూశారు. తన శాఖకు సంబంధించిన మంత్రులను కూడా లెక్కచేయకుండా, కింది స్థాయి అధికారుల పట్ల తాటకిలా ప్రవర్తించారు. డబ్బు సంపాదించడమే ధ్యేయం తప్ప ఆమెకు ఎలాంటి నైతిక విలువలు లేవు,” అని భూమన తీవ్రంగా ధ్వజమెత్తారు.
తిరుపతిలో రోడ్ల నిర్మాణం కోసం ఉద్దేశించిన టీడీఆర్ (Transferable Development Rights) బాండ్ల విషయంలో శ్రీలక్ష్మి వేల కోట్లు దోచుకోవాలని పథకం రచించారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన ఆరోపించారు. “మేము ఆమె అవినీతి ప్రణాళికను అడ్డుకున్నామనే కోపంతో, నెల్లూరు జిల్లా నేతలకు తప్పుడు సమాచారం లీక్ చేసి, నేను రూ. 2000 కోట్లు దోచుకున్నానని నాపైనే ఎదురు ప్రచారం చేయించారు,” అని శ్రీలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో తాను ఏ విచారణకైనా సిద్ధమని, ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
శ్రీలక్ష్మికి 35 ఏళ్ల అవినీతి చరిత్ర ఉందని భూమన ఆరోపించారు. “ఆమె ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్లు లూటీ చేశారు. ఆమె అవినీతి గురించి సుప్రీంకోర్టుకు కూడా తెలుసు. ఆ అధికారిణి రోజు కట్టుకునే చీర ఖరీదు రూ. 1.5 లక్షలు. లక్ష రూపాయల విలువ చేసే 11 విగ్గులు వాడుతున్నారు,” అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు.
వ్యాఖ్యల వెనుక రాజకీయ దుమారం
ఓబులాపురం గనుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శ్రీలక్ష్మి, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ కేడర్‌కు బదిలీపై వచ్చి కీలక శాఖల్లో పనిచేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమెకు ఇంకా పోస్టింగ్ లభించలేదు. ఈ నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వంలోనే కీలకపాత్ర పోషించిన భూమన ఇప్పుడు శ్రీలక్ష్మిని లక్ష్యంగా చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత విభేదమా లేక వైసీపీ ప్రభుత్వంలోని అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బయటపడుతున్నాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలు వైసీపీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


