తెలంగాణలో రాజకీయ సమీకరణాల్ని షర్మిల మార్చేస్తున్నారా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు.. శాశ్వత మిత్రులు వుండరు. అవసరాన్ని బట్టి స్నేహం.. అవసరం లేకపోతే రాజకీయ వైరం.. ఇది రాజకీయాల్లో మామూలే.! రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు తప్ప, శతృవులు వుండరన్న మాట తరచూ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంటుంది.

ఏం చేస్తే, తెలంగాణలో తన ఉనికిని చాటుకోవచ్చు.? అన్న కోణంలో దీర్ఘాలోచన చేసి, చివరికి ‘విపక్షాల ఐక్యత’ అనే కాన్సెప్ట్‌ని తెరపైకి తెచ్చినట్లున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. అసలు విపక్షాల ఐక్యత సాధ్యమేనా.? అందునా, కాంగ్రెస్ అలాగే బీజేపీ, వామపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి వైటీపీతో కలిసి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తాయా.? వైఎస్ షర్మిలకి బీజేపీ ఫుల్ సపోర్ట్ అందించేందుకు సిద్ధంగా వుంది.. అదీ నిరుద్యోగ సమస్య విషయంలో. షర్మిలతో కలిసి పోరాటాలు చేయలేమని కాంగ్రెస్ అంటోంది. వైఎస్ షర్మిలకు ఘాటైన కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాయి వామపక్షాలు.

అయితే, వైఎస్ షర్మిల.. ఇలాంటి పరిస్థితుల్ని ముందే ఊహించి వుండొచ్చు. ‘విపక్షాల్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న షర్మిల..’ అన్న ప్రచారమైతే జనాల్లోకి వెళుతుందని వైటీపీ శ్రేణులు భావిస్తున్నాయేమో. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, ఒకింత పొలిటికల్ హంగామా చేసినా, అదేదీ తన పొలిటికల్ మైలేజ్ పెంచలేదని వైఎస్ షర్మిల భావిస్తున్నట్టున్నారు. ఇప్పుడీ విపక్షాల ఐక్యత వ్యవహారం కూడా.. షర్మిలకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అవకాశం కన్పించడంలేదు. సో, షర్మిల రాజకీయ సమీకరణం.. అట్టర్ ఫ్లాప్ అయినట్టే.!