వైఎస్ షర్మిల రాజకీయం.! పూర్తి గందరగోళం.!

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గతంలోనే ప్రకటించేశారు. అక్కడ కొన్ని ‘సేవా కార్యక్రమాలు’ కూడా రాజకీయ కోణంలో చేపట్టారు. గట్టిగానే ఖర్చు చేశారు కూడా.!

తెలంగాణలో వైఎస్ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. ఈ మధ్యనే రికార్డులకెక్కినట్లు ‘గిన్నీస్ బుక్’ ప్రస్తావన కూడా వచ్చింది. ఇంత చేశాక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి వైఎస్ షర్మిల అంత సీరియస్‌గా ఆలోచించకపోతే ఏం బావుంటుంది.?

అధికార బీఆర్ఎస్ గట్టిగానే హంగామా చేస్తోంది. బీజేపీ సంగతి సరే సరి. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే సౌండ్ చేస్తోంది. వామపక్షాల హంగామా కూడా మొదలైంది. కానీ, వైఎస్ షర్మిల నుంచి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరన్న చర్చ కూడా ఆ పార్టీలో జరగడంలేదాయె.

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల కలిపేయబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోనీ, ఆ ప్రక్రియ అయినా వేగంగా జరుగుతోందా.? అంటే, అదీ లేదాయె. ఆమె గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఓ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్నది తాజా ఖబర్.

కాదు కాదు, ఏపీ నుంచి పోటీ చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనీ, కాంగ్రెస్ పార్టీ కోరుతోందట. దానికి షర్మిల ససెమిరా అన్నారన్నది ఓ ప్రచారం. ఏదో ఒకటి.. వైఎస్ షర్మిల మీడియా ముందుకొచ్చి చెప్పాలి కదా.? చెప్పరాయె.. అంతా గందరగోళమే.!