తన పార్టీని కాపాడుకోవడం జగన్ కు తెలియదా?  

YS Jagan
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో పత్రికా మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు!  అన్నింటికన్నా ప్రధానంగా భావిస్తున్నది వైసిపి కొద్దిరోజుల్లో ఎన్డీయే కూటమిలో చేరబోతున్నది అని!   దీనిమీద ఎవరివద్దా కచ్చితమైన సమాచారం లేదు.  సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ పుకార్లను ఖండించారు.  ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రిని జగన్మోహన్ రెడ్డి కలిసిన తరువాత  ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదే అందరి మదిలో ఉత్కంఠ!  ముఖ్యంగా ముగ్గురు వైసిపి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు అవుతారు అన్న వార్తలు తెలుగుదేశం గుండెల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.  అయితే వైసిపి వెళ్లి ఎన్డీయే సరసన చేరితే రాష్ట్రంలో వైసిపికి ప్రమాదం ముంచుకొస్తుంది అని కొందరు జగన్ అభిమానులు భయపడుతున్నారు.  కొన్ని వర్గాలవారు పార్టీకి దూరం అవుతారని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.   వైసిపి సోషల్ మీడియా వాళ్ళం అని, జగన్ కు వీరాభిమానులం అని చెప్పుకునే వారు కూడా ఇలాంటి భయాల్ని బహిరంగంగా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  
 
YS Jagan

తల్లీ తండ్రి అన్నీ ఆయనే 

ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే..వైసిపి అనే ఒక పార్టీకి పురుడు పోసింది జగన్మోహన్ రెడ్డి.  అప్పట్లో అత్యంత శక్తివంతురాలైన సోనియా, రాహుల్ గాంధీలను సైతం ఎదిరించి, కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా ఏమాత్రం వెరవక,  ఇద్దరు సభ్యులనుంచి పదిహేను స్థానాలకు ఎగబాకి, ఆ తరువాత అరవై ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుదీర్ఘ పాదయాత్రను చేసి, పార్టీ స్థాపించిన ఎనిమిదేళ్లకే అఖండమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాక, నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబును శంకరగిరిమాన్యాలను పట్టించిన జగన్మోహన్ రెడ్డికి తన పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియదా?  ఈ విషయంలో జగన్ కు ఎవరైనా సలహాలు ఇస్తున్నారంటే వారికి జగన్ మీద నిజమైన అభిమానం లేనట్లుగానే భావించాలి.  ఒక్క జగన్ అనే కాదు..చంద్రబాబు కావచ్చు,  కేసీఆర్ కావచ్చు,  ఉద్ధవ్ థాక్రే కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు…వారు పెట్టుకున్న పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడానికి వారు స్వతంత్రంగా బుర్రను మధించి, అధికారపార్టీలను ధిక్కరించి, ఉద్యమాలు, పోరాటాలు చేసి అధికారాన్ని సాధించారు తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి మద్దతును చూసి కాదు.  

పర్యటన సంపూర్ణంగా ఫలప్రదం 

వైసిపి వారే కాదు…మిగిలిన పార్టీలవారు కూడా, ఇక్కడే కాదు…ఢిల్లీలో సైతం జగన్మోహన్ రెడ్డి రాజకీయపుటెత్తులను ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నారు.  ఏ స్థాయిలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎలా ఒప్పించాలో జగన్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.  జగన్ ఊహలను ఆదుకోవడం కూడా తలపండిన నాయకులకు సాధ్యం కావడం లేదు.  ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఎవరూ ఊహించని కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయని,  అనేక అంశాలకు క్లియరెన్స్ రాబోతున్నదని, ఈ ఏడాది చివరిలోగా కొన్ని అనూహ్యమైన పరిణామాలు సంభవించబోతున్నాయని ఢిల్లీ నుంచి నమ్మకమైన సమాచారం.  

జగన్ కు ఆ మాత్రం తెలియదా?

వైసిపి ఎన్డీయేలో చేరితే ఏమవుతుందో అంచనా వెయ్యలేనంత అమాయకుడు కాదు జగన్.  బీజేపీకి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పార్టీ అండ ఉండితీరాలి.  ఆ అవకాశాన్ని తెలుగుదేశం చేతిలో పెట్టడం జగన్ కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.  ఎందుకంటే తనను కేసులనుంచి బయటపడేస్తానంటే, జగన్ నుంచి రక్షిస్తాను అని హామీ ఇస్తే  నూట డెబ్బై అయిదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే నిలబెట్టి కొందరినైనా గెలిపించడానికైనా చంద్రబాబు దిగజారిపోగలడు.  చంద్రబాబు తన నోటిదురుసుతనంతో మోడీకి విరోధి అయ్యాడు.  రాష్ట్రంలో ఎలాంటి తీర్పులు వస్తున్నాయో అందరూ చూస్తున్నారు.  అలాగే పచ్చ మీడియా కూడా ఎంత దుర్మార్గంగా చెలరేగిపోతున్నదో కనిపిస్తూనే ఉన్నది.  రాజధాని వికేంద్రీకరణ సమస్య ఉన్నది.     ఇలాంటి తరుణంలో కేంద్రంతో మైత్రి లేకపొతే జగన్ ను పాతాళానికి తొక్కేయ్యడానికి అనేక శక్తులు సిద్ధంగా  ఉన్నాయి.   కేంద్రంతో విరోధం పెట్టుకుంటే అది రాష్ట్రానికే నష్టం.  ఇక్కడ వ్యక్తిగత రాజకీయాలను, రాష్ట్ర ప్రయోజనాలను వేర్వేరు కోణాల్లోనుంచి చూడాలి.  

ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయం ఏదీ?  

రాబోయే ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తింటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కొందరు ఊహిస్తున్నారు.  బీజేపీ కొన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్నది.  కొన్ని రాష్ట్రాల్లో రాక్షస రాజ్యం గుర్తుకొస్తున్నది.  అనేకమంది బీజేపీ నాయకులు హంతకులుగా, రేపిస్టులుగా తేలుతున్నారు.    అయినప్పటికీ కాంగ్రెస్ మాత్రం పుంజుకోలేకపోతున్నది.  సోనియా గాంధీ పని అయిపొయింది.  మరో నాలుగేళ్ల తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికలవరకు ఆమె చురుగ్గా ఉండటం అనుమానాస్పదమే.  ఇక రాహుల్ గాంధీ, ప్రియాంకా  గాంధీ తమ అసమర్ధతను ఇప్పటికే పలుమార్లు రుజువు చేసుకున్నారు.  బీజేపీ ఎంత దుర్మార్గంగా పాలించినా ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయం లేదు.  మొన్నటి ఎన్నికల ముందు కూడా బీజేపీ కూటమి ఓడిపోతుందని, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, చంద్రబాబు కేంద్రంలో ప్రధాని అవుతాడని, హోమ్ మంత్రి అవుతాడని, రాష్ట్రపతి అవుతాడని ప్రసిద్ధ పత్రికలు కూడా ఊదరగొట్టాయి.    కానీ, అది జరిగిందా?   బీజేపీ పట్ల వైముఖ్యం పెరిగిందనుకున్నా, కాంగ్రెస్ పట్ల సుముఖత పెరిగిన దాఖలా లేదు.   1947 నుంచి 1977  వరకూ కేంద్రంలో ముప్ఫయి ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీయే ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించింది మరువద్దు.  సరైన ప్రత్యామ్నాయం లేనపుడు బీజేపీ ఓడిపోతుందని అంచనాకు రాలేము.       ఒకవేళ  రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలో చంద్రబాబు మళ్ళీ కీలకపాత్ర పోషిస్తారు.  అప్పుడు ఆయన జగన్ను తేలికగా వదిలిపెడతారా?  ఇక్కడ జగన్ మరో పదేళ్లు అధికారంలో ఉండాలంటే కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉండక తప్పదు.  ఇలాంటి అంశాలన్నీ జగన్ పరిగణనలోకి తీసుకోకుండా ఉంటారా?  సోషల్ మీడియాలో అభిమానుల పోస్టులను చూసి ఏ రాజకీయపార్టీ కూడా తన మంత్రాంగాలను, వ్యూహాలను  మార్చుకోదు
 
ఎన్డీయే కూటమిలో వైసిపి చేరినంతమాత్రాన ఏమీ నష్టం లేదు.  తాత్కాలికంగా కోపావేశాలకు లోనయ్యేవారు తెలుగుదేశం, జనసేనల వైపు మొగ్గు చూపినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.   ఢిల్లీలో నిన్నటి జగన్ పర్యటనను చూసినవారు ఇచ్చిన సమాచారం ఏమిటంటే…మరో ఇరవయి ఏళ్ళు జగన్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎవ్వరూ కదిలించలేరు అని!!  ఢిల్లీ పెద్దల్లో అలాంటి అభిప్రాయమే ఉన్నదని!!
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు