Pawan Kalyan – YS Jagan: పవన్ పై విమర్శలు జగన్ కు మేలు చేస్తాయా?

అధికారం కోల్పోయినా జగన్ అహంకారం వీడలేదా? తన నోటి దురుసుతనంతో పార్టీకి చేటు చేస్తున్నారా? తన ఫ్రస్టేషన్ తగ్గించుకోకపోతే జనానికి దూరమవుతారా?

తాజాగా వైయస్సార్సీపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ అనుమానాలే జనానికి కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించిన జగన్ తన ప్రసంగం చివర్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త డిస్కషన్ కి తెర లేపాయి. నిజానికి ఈ మీడియా సమావేశంలో బడ్జెట్లో డొల్లతనాన్ని జగన్ చక్కగా బయటపెట్టారు. చక్కటి డాటాతో కేటగారికల్ గా సాగిన ఆయన విమర్శ పలువురి ప్రశంసలు అందుకునేలా ఉంది.

కూటమి నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు బడ్జెట్లో చేసిన కేటాయింపులకూ పొంతన లేని విషయాన్ని ఆయన బాగా ఎండగట్టారు. సూపర్ సిక్స్ హామీలకే కాక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల అమలు విషయం ఏమైందని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. అధికారంలోకి వచ్చి 9 నెలల కావస్తున్నా హామీలను అమలు చేయకుండా జనాల్ని ప్రభుత్వం మోసం చేస్తోందని అంకెలతో సహా వివరించి రుజువు చేశారు.

రాష్ట్రానికి ఉన్న అప్పుల పై ప్రభుత్వం చెబుతున్న అబద్దాలను, గత ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆయన తిప్పి కొట్టారు. జగన్ స్పీచ్ అదరగొట్టారు. హి ఈజ్ బౌన్స్ బ్యాక్ అని ఆయన అభిమానులు ఆనందిస్తున్న దశలో ఆయన నోరు జారారు. సమావేశం చివరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవు అని ఆయన పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లిపోండి అని పవన్ చేసిన కామెంట్ పై వ్యాఖ్యానించమని మీడియా ప్రతినిధులు కోరగా జగన్ అహంకార పూరితంగా స్పందించారు. ఆయన కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారు.

అలాగే చంద్రబాబును ఉద్దేశించి దుర్మార్గుడు, అన్యాయస్థుడు, రాక్షసుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూటమి నాయకులు జగన్ పై విరు చుకుపడ్డారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లా ఉంటుందని లోకేష్ దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఎదుటివారిని చులకనగా ఒక మాట అని పది మాటలు అనిపించుకోవడం ఎందుకు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు.

అసలు పవన్ ను ఎమ్మెల్యే కు తక్కువ అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాక తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఒక పార్టీకి అధ్యక్షుడు. 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 19 స్థానాలూ గెలిచిన నాయకుడు. కూటమి ప్రభుత్వంలో ఏకైక ఉప ముఖ్యమంత్రి. అటువంటి నాయకుడిని పట్టుకుని ఎమ్మెల్యేకు తక్కువ అంటే ఆ వ్యాఖ్యలో పస లేదు సరిగదా అక్కసు కనిపిస్తోందని విమర్శకులు జగన్ ధోరణిని తప్పు బడుతున్నారు. నిజానికి ఇటువంటి అహంకార పూరిత వ్యాఖ్యల వల్లే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిందని ఇప్పటికి విశ్లేషణలు వ్యాఖ్యానిస్తుంటారు.

2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు దాడిని పెంచిన జగన్ ఎన్నికల్లో అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. పవన్ గురించి ఆయన పెళ్లిళ్ల గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి జనంలో జగన్ చులకనయ్యారు. ఈ సంగతిని ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు కానీ జగన్ ఇప్పటికీ గ్రహించకపోవడం గమనార్హం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలే తప్ప ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేస్తే పార్టీకి చేటు చేస్తుంది అని ఆయన గ్రహించాల్సి ఉంది. ఒకపక్క అభ్యంతరకరంగా, అన్ పార్లమెంటరీగా మాట్లాడిన పార్టీ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతుంటే పార్టీ అధినేతగా జగన్ అదే తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు.

ఎదుటి పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సొంత పార్టీలో వారి జోష్ అవుతారేమో తప్ప ప్రజలు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలను అంగీకరించరు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వా న్ని ఎలా విమర్శిస్తున్నారు . ప్రభుత్వ విధానాలపై ఏ విధంగా పోరాడుతున్నారు అన్నది జనం నిత్యం గమనిస్తూనే ఉంటారు. ఇది గమనించకుండా గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా మళ్లీ పాత పద్ధతిలోనే వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రయోజనం ఉండదు. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఎంతో కొంత కీడు చేస్తాయే తప్ప ఏ మాత్రం మెయిల్ చేయవని జగన్ ఎంత తొందరగా గమనిస్తే పార్టీకి ఆయనకు అంత మంచిదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.