ఇట్లు, మీ #PavitraNaresh: మైసూర్ లో పెళ్లి… దుబాయ్ లో హనీమూన్!

ఆన్ లైన్ సెన్షేషనల్ కపుల్ “నరేష్ – పవిత్ర”లకు సంబంధించి ఒక వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. గతకొంతకాలంగా వీరికి సంబంధించి ఏ చిన్న విషయం వెలుగులోకి వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ అయిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరో సంచలనమైన వీడియో విడుదల చేసింది ఈ ప్రేమ జంట!

అవును… సినీ నటుడు నరేష్‌ – నటి పవిత్రా లోకేశ్‌ లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్‌ లో ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేష్‌.. తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇంకేముంది… క్షణాల్లోనే ఆ వీడియో వైరల్‌ గా మారింది.

“శాంతి, సంతోషాలతో కూడిన మా నూతన ప్రయాణానికి మీ ఆశీస్సులు కోరుతున్నాను. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ.. ఇట్లు, మీ #PavitraNaresh….” అంటూ నరేష్‌ ట్వీట్‌ చేశారు. దీంతో వీరికి శుభాకాంక్షలు వెళ్లువలా వచ్చిపడుతున్నాయి!

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… నరేష్‌ కు ఇది నాలుగో పెళ్లికాగా.. పవిత్రా లోకేశ్‌ కు ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్‌ కోసం దుబాయ్‌ కు వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్‌ లోని ఇసుకతెన్నెలపై సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి!

కాగా… వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని.. మైమరచి ప్రేమించుకుంటున్నారని అప్పట్లో ఆన్ లైన్ వేదికగా వార్తలొచ్చేవి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ… డిసెంబరు 31 న పవిత్రను ముద్దాడుతూ నరేష్ ఒక వీడియో విడుదల చేశారు. దీంతో ఆ వార్తలకు బలం చేకూరగా… తాజా పెళ్లి వీడియోతో నిర్ధారణ అయ్యింది. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే… రమ్య రఘుపతితో నరేష్ విడాకుల వ్యవహారం ఇంకా కోర్టు విచారణలో ఉంది!