Yoga Day: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు.!

నిత్యం ఆరోగ్యంగా, శాంతిగా జీవించాలని కోరుకునే వారికి యోగా ఉత్తమ మార్గం. దీని కారణంగా ఫిజికల్ ఫిట్‌నెస్ మాత్రమే కాదు… మానసిక ప్రశాంతత, జీవక్రియల మెరుగుదల, హార్మోన్ బ్యాలెన్స్‌ వరకు ఎన్నో ఉత్తమ ఫలితాలు అందించే జీవనశైలి పద్ధతి ఇది. అందుకే యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.
యోగా చరిత్ర చూస్తే దాదాపు ఐదువేల సంవత్సరాల పూర్వం నుంచే మనతో పాటు సాగుతోంది. ఇది కేవలం వ్యాయామంగా కాకుండా, శరీరం-మెదడు మధ్య సమన్వయాన్ని పెంచే మార్గంగా నిలుస్తోంది. నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రాచీన శాస్త్రం విశిష్టతను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం.

యోగాతో ప్రయోజనాలు:
రోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శ్వాస పద్ధతులు, ప్రాణాయామాలు మెదడుకు రిలీఫ్ ఇస్తాయి. ప్రైమరీ స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గి, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు యోగాతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. యోగా వల్ల శరీరంలోని లింఫ్ నోడ్స్ యాక్టివ్ అవుతాయి. రోగనిరోధక కణాలు చురుకుగా పనిచేస్తాయి. ఇది శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

వయసుతో సహజంగా వచ్చే ఎముకల బలహీనతకు యోగా మెరుగైన ఔషధం. కండరాలు, నరాలు బలపడతాయి. మెదడు సామర్థ్యం పెరుగుతుంది. మతిమరుపు, జాయింట్ పేఇన్‌లకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. శ్వాస సంబంధిత వ్యాయామాలు రక్తప్రసరణను మెరుగుపరచి, బీపీని సరిచేస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగవడం వల్ల బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

నిద్ర బాగా పట్టకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు యోగా మంచి పరిష్కారం. వారానికి రెండు సార్లు యోగా చేసినా మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగవుతుంది. ఇక యోగాలో భాగంగా చేసే కొన్ని ఆసనాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. తినిన ఆహారం సమర్థవంతంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

యోగాతో శరీరంలో రక్తప్రసరణ మెరుగవడంతో పాటు చర్మానికి తాజా వెలుగు లభిస్తుంది. మొటిమలు, ముడతలపై అదుపు కలుగుతుంది. అంతేకాక జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మల్టిపుల్ స్క్లైరోసిస్ (ఎంఎస్) లాంటి వ్యాధులను నియంత్రించడంలో యోగా ప్రయోజనకరం. నరాల పనితీరును మెరుగుపరచడం ద్వారా శరీరం బ్యాలెన్స్‌ను నిలబెట్టేలా చేస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే… యోగా అనేది శరీరం, మానసికం, ఆత్మ ఈ మూడింటికీ సంక్లిష్టంగా పనిచేసే సంపూర్ణ ఆరోగ్య పద్ధతి. రోజూ కొద్ది నిమిషాలు అయినా యోగా చేయడం ద్వారా జీవిత నాణ్యత మెరుగవుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే యోగాన్ని జీవనశైలి లో భాగం చేసుకోవాల్సిందే.