మహిళా రిజర్వేషన్.! బీజేపీకి ప్లస్సా.? మైనస్సా.?

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటుకు వెళుతోంది. క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్ట సభల నుంచి ‘క్లియర్’ అవడం పెద్ద విషయం ఏమీ కాదు.! రెండు చోట్లా ఎన్డీయే సర్కారుకి అవసరమైనంత మెజార్టీ వుంది మరి.!

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుంది ఈ బిల్లు. ఇది చట్ట రూపం దాల్చితే, చాలామంది రాజకీయ ప్రముఖులు తమ రాజకీయ జీవితానికి ముగింపు పలకాల్సిందేనన్న చర్చ జరుగుతోంది. ఆ కారణంగానే, ఇన్నేళ్ళుగా ఈ ‘చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్’ అంశం నానుతూ నానుతూ వచ్చింది.

సరిగ్గా, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ తీసుకున్న అత్యంత సంచలనాత్మక నిర్ణయం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు.! బిల్లు చట్ట సభల్లో ఆమోదం పొంది, వెంటనే అమల్లోకి వచ్చేస్తే ఎలా.? అని అప్పుడే రాజకీయ నాయకుల్లో గుబులు బయల్దేరింది.

అయితే, వెంటనే అమల్లోకి రాదు.. తర్వాతి ఎన్నికలకి.. అంటే, 2029 ఎన్నికల నాటికి ఇది అమల్లోకి రావొచ్చునన్న వాదనా లేకపోలేదు. ఎప్పుడొచ్చినాసరే, ఇది పురుషాధిక్య సమాజానికి సవాల్ విసిరే బిల్లు అన్నది నిర్వివాదాంశం.

చట్ట సభల్లో మహిళా నేతలున్నారు.. కీలక పదవుల్లో వున్నారు.. రాష్ట్రాల్లో మంత్రులు.. జాతీయ స్థాయిలో మంత్రులు.. అంతేనా, రాష్ట్రపతి కూడా మహిళే ఇప్పుడు.! అయినాగానీ, ఆయా మహిలా ప్రముఖుల అధికారాలు, వారి వారి కుటుంబ సభ్యుల (భర్త లేదా కుమారుడు లేదా సోదరులు లేదా మామ..) కనుసన్నల్లోనే మగ్గిపోతున్నాయన్న విమర్శలు లేకపోలేదు.

పైకి గట్టిగా చెప్పలేకపోతున్నారుగానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ నేతలే సమర్థించలేని పరిస్థితి. ఎవరు మాత్రం, తమ రాజకీయ జీవితానికి ‘ముగింపు’ పలికే నిర్ణయాన్ని స్వాగతించగలరు.? అయినా, ఇస్తున్నది 33 శాతం రిజర్వేషన్లే కదా.. ఈ మాత్రందానికే ఇంత లొల్లి ఎందుకు.? ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం..’ అని మహిళల గురించి చెబుతుంటాం. ఆ లెక్కన, 50 శాతం రిజర్వేషన్లను మహిళలు చట్ట సభల్లో కోరితే.?