Vijayashanthi: ఏపీ, తెలంగాణలో రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖుల ప్రాధాన్యత పెరుగుతోంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏపీ శాసన మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ తరఫున విజయశాంతి శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే, ఆమెకు కేబినెట్‌లో స్థానం దక్కుతుందా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు, నాగబాబును రాజ్యసభకు పంపాలన్న పవన్ ప్రతిపాదనను పక్కన పెట్టి, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, కేబినెట్‌లో చోటు కల్పించాలని నిర్ణయించారు. దీంతో నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది జనసేనకు మరింత బలాన్ని అందించనుంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో విజయశాంతికి కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే తీరుతెన్నులు, కాంగ్రెస్‌లో ఆమెకు ఉన్న అనుభవం, గులాబీ పార్టీకి ప్రతిస్పందించగల శక్తి వీటన్నింటిని పరిశీలిస్తే, ఆమెను మంత్రిగా నియమించేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ఒకవేళ నాగబాబు, విజయశాంతి ఇద్దరూ మంత్రులుగా బాధ్యతలు చేపడితే, తెలుగు రాష్ట్రాల్లో సినీ రంగానికి రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. మరోవైపు, బీఆర్ఎస్‌కు ఇది పెద్ద షాక్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాములమ్మకు మంత్రిపదవి లభిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.