కొండనాలుకకు మందేస్తే… బీఆరెస్స్ కు రివర్స్ అవుతుంది!

“కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా తయారవుతుంది బీఆరెస్స్ పరిస్థితి” అనే కామెంట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఉన్న సమస్యలతో సతమతమవుతుంటే… అవి చాలవన్నట్లు ఆత్మీయ సమ్మెళ్లనాల్లో వెలుగులోకి వస్తున్న అల్లరి మరింత తలపోటుగా తయారయ్యిందని అంటున్నారు. అవును.. ఆత్మీయ సమ్మేళనాలను ఒకందుకు చేపడుతుంటే.. అవికాస్త మరోరకం సమస్యగా పరిణమిస్తున్న పరిస్థితి ప్రస్తుతం బీఆరెస్స్ లో నెలకొంది. దీంతో… నేతలకు కార్యకర్తల మధ్య ఉన్న గ్యాప్‌ ను తగ్గించేందుకని చేస్తుంటే… ఆ గ్యాప్ మరింత పెరగడంతోపాటు బహిరంగమవుతుందనే చర్చ బీఆరెస్స్ వర్గాల్లో మొదలైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్న బీఆరెస్స్ పార్టీ… ఏప్రిల్ 25వ తేదీ లోపు ఆ కార్యకరమాలను పూర్తిచేయాలని శ్రేణులకు ఆదేశించింది. అందుకోసం జిల్లాలకు సమన్వయకర్తలుగా జిల్లా ఇన్చార్జ్ లను నియమించింది. ఇప్పటికె జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సమన్వయకర్తలను నియమించింది. అయితే ఈ సమ్మేళనాలు పార్టీకి ప్లస్ అవ్వడం సంగతి పక్కనెట్టి.. గ్రూపు రాజకీయాలకు వేదికవుతున్నాయి. పార్టీ క్యాడర్ సైతం నేతల తీరును సమ్మేళనాల సమావేశంలోనే నిలదీస్తూ… కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు తెలంగాణ భవన్లో ఈనెల 21న నిర్వహించిన హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు నేతలను నిలదీశారు. మంత్రి తలసాని, మంత్రి మహమూద్ అలీ ముందే పార్టీ కార్యకర్తలు నేతల తీరును తప్పుపట్టారు. తమ సమస్యను విన్నవించుకుందామనుకున్న నేతలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అలాంటప్పుడు పార్టీలో ఉండి లాభమేంటని ప్రశ్నించారు. ప్రజల వద్దకు ఎన్నికల సమయంలో ఎలా పోవాలో మీరే చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం… ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా హితవు పలికారు.

హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ జిల్లా సమన్వయకర్త దాసోజు శ్రవణ్ నిర్వహించాల్సిన అన్ని బాధ్యతలూ.. తలసాని అన్నీ తానై నిర్వహించడంతో జిల్లా అధ్యక్షుడే గైర్హాజరయ్యారయిన పరిస్థితి. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా గైర్హాజరయ్యారు. ఇదేక్రమంలో… కరీంనగర్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ కేడర్ నేతల తీరును తప్పు పట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌ ను నిలదీశారు. మహేశ్వరం నియోజకవర్గ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన కొత్త మనోహర్ రెడ్డి మీడియా వేదికగా మంత్రి సబితపై విమర్శలు చేశారు. ఉద్యమకారులకు, పార్టీలో మొదటినుంచి పనిచేస్తున్న నేతలకు అన్యాయం జరుగుతుందని.. సబితా ఇంద్రారెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బహిరంగంగా విమర్శలు చేశారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు చాలా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో అసంతృప్తి మరోసారి బహిర్గతం అవుతుంది! దీంతో… పార్టీ నేతలకు – కేడర్ కు మధ్య ఉన్న గ్యాప్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం చూపించే ప్రమాధం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో అందరిని కలుపుకొని పోవాలని పార్టీ అధిష్టానం సూచిస్తున్నప్పటికీ.. కింది స్థాయి నేతలు తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరి అధినేత ఈ విషయం దృష్టిపెడతారా.. పెడితే ఎంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరిస్తారన్నది వేచి చూడాలి!