కోదండరాం లేని జెఎసి కి రఘు కొత్త ఊపు తెస్తారా ?

తెలంగాణ జెఎసి పేరు వినగానే రాష్ట్రం కోసం చెమట చిందించిన తెలంగాణ వాదుల మొహాలు వెలిగిపోతాయి. తెలంగాణ సాధనలో జెఎసి ప్రాముఖ్యత అంతగా ఉంది. తెలంగాణ రాకముందు టిఆర్ఎస్, తెలంగాణ జెఎసి చెట్టాపట్టాలేసుకుని నడిచాయి. నీతోడు నాకు.. నాతోడు నీకు అన్నట్లు జెఎసితో టిఆర్ఎస్ మెలిగింది. తర్వాత తెలంగాణ కోసం జెఎసి పోరాటంలో అగ్రభాగాన నిలిచింది. కొన్నిసార్లు కేసిఆర్ తో కలిసి నడిచింది. మరికొన్నిసార్లు కేసిఆర్ ను కాదని ఉద్యమాలు నిర్మించింది. అంతిమంగా తెలంగాణ వచ్చింది. అప్పటితో జెఎసి కి కష్టాలు మొదలయ్యాయి. జెఎసి మనుగడ తమకు నష్టం కలిగిస్తుందన్న ఉద్దేశంతో పాలక పార్టీ చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించింది. జెఎసిలో ఉన్న ఉద్యోగ సంఘాలను బయటకు వెళ్ళగొట్టింది. చివరకు కోదండరాంతోపాటు కొన్ని కుల సంఘాలు, సామాజిక సంస్థలు మాత్రమే జెఎసిలో మిగిలాయి. అయినా కోదండరాం ఉన్నంతకాలం జెఎసి హడావిడి బాగానే సాగింది. ఎప్పుడైతే కోదండరాం జెఎసి ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారో.. అప్పటి నుంచి జెఎసి ప్రతిష్ట మసకబారిన వాతావరణం ఉంది. మరి అలా మసకబారుతున్న జెఎసికి ప్రస్తుత ఛైర్మన్ రఘు కొత్త ఊపు తెస్తారా? చదవండి స్టోరీ.

కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత జెఎసి ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. తాను లేకపోయినా జెఎసి పనిచేస్తుందని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే జెఎసి కి తమ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక మే 13వ తేదీన జెఎసికి కొత్త ఛైర్మన్ గా విద్యుత్ జెఎసి నేత రఘు అయ్యారు. మే 13 నుంచి రెండు నెలలు గడిచిన క్రమంలో ఇప్పటి వరకు జెఎసి కేవలం ఒక చిన్న సదస్సు మాత్రమే జరిపింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈనెల 14వ తేదీన ‘‘ఉద్యమ ఆకాంక్షలు.. వర్తమాన తెలంగాణ’’ అనే అంశంపై సదస్సు జరిపింది. దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎం వేణుగోపాల్ లాంటి వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 28 జిల్లాల నుంచి జెఎసి ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సు తర్వాత జెఎసి విస్తృత స్థాయి సమావేశం జరిపింది. జెఎసిని బలోపేతం చేయాలని అందరూ నిర్ణయించారు. అందులో భాగంగానే ఈనెల 29న ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘‘కాలేశ్వరం ఎత్తిపోతల పథకం లాభమా? నష్టమా?’’ అన్న అంశంపై రౌండ్ టేబుల్  సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికోసం గత రెండు నెలలుగా పెద్ద కసరత్తే జరిపినట్లు జెఎసి ఛైర్మన్ రఘు తెలుగురాజ్యం కు తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ  రౌండ్ టేబుల్ ప్రారంభమవుతుందన్నారు. ముందుగా 45 నిమిషాల పాటు కాలేశ్వరం ప్రాజెక్టు పై రెండు ప్రజెంటేషన్స్ ఉంటాయన్నారు. తర్వాత నిపుణులు, రాజకీయ నేతల ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసి, టిడిపి, తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీల నేతలను ఆహ్వానించినట్లు చెప్పారు.

కోదండరాం జెఎసి నుంచి నిష్క్రమించిన తరువాత జెఎసి పని అయిపోయిందన్న వాతావరణం నెలకొంది. కానీ అప్పుడున్నంత దూకుడుతో కాకపోయినా నిర్మాణాత్మక పాత్ర పోశిస్తామని రఘు ధీమా వ్యక్తం చేశారు. తమ ఉద్యోగం చేస్తూనే జెఎసి నిర్మాణం చేపడతామన్నారు. తొలుత తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యలు, పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు. తెలంగాణ జన సమితిని కోదండరాం ఏర్పాటు చేసిన తర్వాత జెఎసిలో ఉన్నవారిలో చాలామంది పార్టీలోకి వెళ్లిపోయారని అన్నారు. అయినప్పటికీ ఇంకా జెఎసికి కొత్త రక్తం వస్తూ ఉందని చెప్పారు. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్, కాంట్రాక్ట్ వర్కర్స్, కుల సంఘాలు, డాక్టర్స్ జెఎసి, అడ్వొకెట్స్ జెఎసి, టీచర్లు, రైతు సంఘాలు జెఎసిలో అంతర్భాగంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నిపుణుల కొరత జెఎసికి ఏమాత్రం లేదని చెప్పారు. ఇరిగేషన్, పవర్, ఎకనమిక్స్ లాంటి  అంశాలపై నిరంతరం అధ్యయనం చేసి సమాచారాన్ని అందజేస్తానని చెప్పారు. నిరుద్యోగ సమస్యపై ఇప్పటికే అధ్యయనం చేశామన్నారు. అన్ని రంగాల ఎక్స్ పర్ట్స్, మేధావులు జెఎసి లో పనిచేస్తున్నారని తెలిపారు. మొన్న 14వ తేదీన జరిగిన మీటింగ్ తర్వాత జెఎసిని బలోపేతం చేయడం పెద్ద కష్టమేమీ కాదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే జిల్లాల కమిటీల నిర్మాణం చేపట్టి వర్తమాన అంశాల మీద అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఆదివారం జరగనున్న సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు వివరించారు. అంతర్జాతీయ ఇరిగేషన్ ఎక్స్ పర్ట్ గుజ్జ భిక్షం, ఇతర ప్రముఖులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపారు. ఈ ప్రజెంటేషన్ లో భాగంగా ప్రాజెక్టు సంపూర్ణ విశ్లేషణ ఉంటుందన్నారు. ప్రాజెక్టు వల్ల లాభ నష్టాలు, ఖర్చులు, రీ డిజైనింగ్ దాని ప్రభావం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు డిజైన్ వంటి అంశాలను చేర్చినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ హాజరవుతారని చెప్పారు.