వారణాశిలో మోడీ మీద ప్రియాంక పోటీ చేస్తుందా?

(మల్యాల పళ్లంరాజు)

సోనియా,రాజీవ్ గాంధీల ముద్దులపట్టి ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రంతో ఉత్తర ప్రదేశ్ రాజకీయరంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రియాంక ను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి, యూపీ తూర్పు ప్రాంతం బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ శ్రేణులు పండుగ చేసుకున్నాయి.

ఇన్నాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ కి సవాల్ గా నిలిచే, బలంగా ఢీ కొట్టగల ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకువచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. తమను నిర్లక్ష్యం చేసిన ఎస్పీ,బీఎస్పీలకు పార్టీ అధిష్టానం చెంపపెట్టు లాంటి నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు. కంగుతిన్న ఎస్పీ, బీఎస్పీ ఏడుపుముఖం కడుక్కుని నవ్విన చందంగా ప్రియాంక రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించాయి. ప్రియాంక రాకతో వారణాశిలో కాంగ్రెస్ శ్రేణులు హర్షామోదాలు ప్రకటించాయి. ప్రియాంక రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారన్నవార్తతో వారణాశి లోని కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తి చెందడం లేదు. వారణాశిలో మోడీ ఢికొట్టగల సమర్థురాలు తమ నాయకురాలు అని కార్యకర్తలు, యువకులు, మహిళలు భావిస్తున్నారు. దీంతో ప్రియాంక వారణాశి నుంచి పోటీ చేయాలన్న వత్తిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక దశలో వారణాశినుంచి ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుతూ, ప్రియాంక భారీ చిత్రాలతో పోస్టర్లు కూడా వెలిశాయి. కాశీ ప్రజలు ప్రియాంకను తమ ఎంపీగా చూడాలను కుంటున్నారని పేర్కొంటూ… కాశీ కీ జనతా ఫుకార్… ప్రియాంక గాంధీ హో సన్స ద్ హమార్.. నినాదాలతో పోస్టర్లు వారణాశి నగరమంతా హల్ చల్ చేస్తున్నాయి.

వారణాశిలో నరేంద్రమోదీకి పోటీగా నిలిచే అభ్యర్థి యూపీలో కరవయ్యారు. ప్రియాంక పోటీ చేస్తే.. ఎస్పీ, బీఎస్పీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆమెనే ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరించే అవకాశం ఉంది.

ప్రియాంక కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంగా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బ్రహ్మాస్త్రం దీటైన అభ్యర్థిపై ప్రయోగించాలి కానీ, చిల్లర గాళ్లమీద ప్రయోగించడం ఏమిటన్నది వారి వాదన. ప్రియాంక ప్రత్యక్షంగా బలమైన మోదీతో పోటీకి సిద్ధపడితే, మోదీకి దేశంలో ఎవరూ భయపడడం లేదన్న జనంలోకి వెళ్తుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే వీలున్నదన్నవాదన ప్రబలంగా విన్పిస్తున్నది. అంతేకాదు. ప్రియాంక రాకతో బీజేపీ బలమైన బ్రాహ్మణ, భూమిహార్ ఓటు బ్యాంకు బద్దలవుతుందనే వాదన ఉంది. అయితే, ప్రియాంక వారణాశి నుంచి పోటీ చేస్తారా అన్నదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న.

వారణాశిలో విజయావకాశాలు

ఉత్తరప్రదేశ్ లో కుల,మత పరమైన ఓట్లే విజయావకాశాలను నిగ్గుతేలుస్తాయి. ప్రియాంక వారణాశి నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా పోటీ పడిన పక్షంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలతో సహా అన్ని రాజకీయపార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేదీ నియోజకవర్గాలలో తాము పోటీ చేయబోమని ప్రకటించాయి. ఇక వారణాశిలో పోటీ విషయానికి వస్తే కచ్చితంగా ఆ పార్టీలు ప్రియాంక అభ్యర్థిత్వాన్ని సమర్థించి తీరతాయి. దీంతో వారణాశి పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల మేరకు ఉన్న ముస్లీం ఓటర్లు ఏకపక్షంగా ఎస్పీ, బీఎస్పీ సమర్థించిన ప్రియాంకకే ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే లక్షన్నర పైగా ఉన్న ఎస్పీ సాంప్రదాయక యాదవ ఓటర్లు, బీఎస్పీకి మద్దతు నిస్తున్న 80 వేలకు పైగా దళితులు కాంగ్రెస్ విజయానికి తోడ్పడే వీలున్నది. అంటే దాదాపు 5 లక్షల 30 వేలఓట్లు ప్రియాంక ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రియాంక రంగంలోకి దిగితే, నియోజకవర్గంలో ఉన్న దాదాపు రెండున్నరలక్షల బ్రాహ్మణ ఓటర్లు, లక్షన్నర మేరకు ఉన్న భూమిహార్ లలో అధిక సంఖ్యాకులను కాంగ్రెస్ ఆకట్టుకోవచ్చు. నిజానికి వీరంతా ఒకప్పుడు కాంగ్రెస్ సాంప్రదాయక ఓటర్లే. బీజేపీ మందిర్ మస్జిత్ రాజకీయాల నేపథ్యంలో ఆపార్టీ పక్షాన చేరారు. నిజానికి వారంతా కాంగ్రెస్ పట్ల సానుభూతితో ఉన్నవారే. కానీ, ఎస్పీ, బీఎస్పీలకు వ్యతిరేకం. ప్రియాంక వారణాశిలో పోటీ చేస్తే, ఆమెకు ఎస్పీ, బీఎస్పీ మద్దతు నిచ్చినా.. కాంగ్రెస్ తిరిగి వారి ఓట్లను రాబట్టుకునే వీలున్నది

వారణాశి పార్లమెంటరీ నియోజకవర్గంలో కులాలు, మతాల వారి ఓటర్లు ఎవరు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారు. ఎవరు బీజేపీ పక్షాన నిలుస్తారు అని స్థూలంగా పరిశీలిస్తే…

నియోజకవర్గంలో ఉన్న రెండున్నర లక్షల మంది బ్రాహ్మణులు, (ఎస్పీ మద్దతు ఇస్తే) లక్షన్నర యాదవులు, లక్షన్నర భూమిహార్ లు, (బీఎస్పీ మద్దతు ఇస్తే) 80 వేల దళితులు, 3 లక్షల మేరకు గల ముస్లింలు ప్రియాంకకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

ఇక బీజేపీ  పక్షాన నిలిచే ఓటర్లలో లక్షన్నర మంది కుర్మీలు( అప్నాదళ్ ఎన్డీఏతో ఉన్నందువల్ల) లక్ష మంది రాజ్ పుట్ ఓటర్లు, 65 వేల మంది కాయస్త ఓటర్లు,  రెండు లక్షల వైశ్య ఓటర్లు, 80 వేల మేరకు గల చౌరాశియాలు మోదీకి అండగా నిలవవచ్చు. అంటే మోదీ పక్షాన 8న్నర లక్షలమంది నిలిచే వీలున్నది. అంటే  నాలుగు లక్షల మేరకు గల బ్రాహ్మణ, భూమిహార్ ఓటర్లే విజయావకాశాలను నిర్ణయించే అవకాశం ఉందన్న మాట. ప్రియాంక బీజేపీ ఓట్ బ్యాంక్ గా భావిస్తున్న అగ్రవర్ణాలు, బ్రాహ్మణ, భూమిహార్ ల ఓట్లను ఆకట్టుకో గలిగితే వారణాశిలో మోడీ గెలుపు కష్టమే.   అసాధ్యమైన ఈ విజయాన్ని ప్రియాంక అందుకోగలిగితే.. రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమే…

 

అన్నప్రాసన నాడే ఆవగాయ ముద్దా?

 

      ప్రియాంక తొలిసారిగా అధికారికంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడే అడుగు పెడుతున్నది. ఆరంభంలో ఆమెను యూపీ తూర్పులోని దాదాపు 30 పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. గతంలో సోనియా గాంధీ విజయ పరంపర సాధించిన రాయ్ బరేలీ నుంచే పోటీ చేయడం తో పాటు ఈ 30 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలలో కాంగ్రెస్ గెలిచేందుకు కృషి

చేస్తే.. ప్రియాంగ  కాంగ్రెస్ విజయ సారధిగా ముద్రపడే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్ లో దేశవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు చేపట్టి జాతీయ నాయకురాలు అనిపించుకునే వీలున్నది. అలాంటి భవిష్యత్ గల నాయకురాలిని వారణాశిలో మోదీతో పోటీకి నిలబెడితే.. ఒకవేళ మొదట్లోనే.. ఆమె ఓటమి పాలైతే.. పరిస్థితి ఏమిటి..(తెలంగాణలో పోటీ చేసి ఓటమి పాలైతే ఆంధ్రప్రదేశ్ లో తమ విజయావకాశాలు దెబ్బతింటాయన్న వ్యూహంతోనే వైఎస్ ఆర్  కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన నేత పవన్ కల్యాణ్ ఎన్నికల గోదా నుంచి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.) తొలి మెట్టుపైనే ఓటమి పాలైతే.. కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోతుందేమో అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నవారు లేకపోలేదు.  అందువల్ల కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక విషయంలో ఆచీ తూచీ వ్యవహరించడం అవసరం.

 

(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ 9705347795)