శ్రావణ మాసం అంటే శివుని భక్తులకు ప్రత్యేక పుణ్య కాలం. ఈ మాసాన్ని పరమేశ్వరుని పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ సమయంలో శ్రద్ధగా శివుడిని పూజిస్తే భక్తుల కోరికలు తీర్చుకుంటాయని పెద్దలు చెబుతారు. ఈ కాలంలో ఆలయాలకు వెళ్లి శివలింగాన్ని దర్శించటం ఎంతో శ్రేష్ఠం. ఎందుకంటే ఆలయంలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం మన మనసుకి శాంతిని ఇస్తుంది. అయితే ఆలయానికి వెళ్లడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే అదే ఫలితం లభిస్తుంది. అయితే ఇంటి పూజకు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
ఇంట్లో ఏ శివలింగం పూజించాలి: పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇంట్లో బొటనవేలి పరిమాణంలో చిన్న శివలింగాన్ని మాత్రమే పూజించాలి. దీనివల్ల పూజ సులభంగా, శాస్త్రోక్తంగా జరుగుతుంది. నర్మదా నది రాయితో తయారైన నర్మదేశ్వర్ శివలింగం అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. ఎందుకంటే శివుడు నర్మదా రాయిలో నివాసిస్తాడని పురాణ విశ్వాసం. ఆ శివలింగం దొరకని పరిస్థితిలో బంగారు, వెండి లేదా ఇత్తడి శివలింగాలను పూజించవచ్చు. వీటికి కూడా విశేష ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు.
సంపద కోసం ఏ శివలింగం: ధన లాభం, ఐశ్వర్యం కోరుకునే వారు బంగారు శివలింగాన్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సౌభాగ్యం, కీర్తి కోసం వెండి శివలింగం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. పాదరస శివలింగం అత్యంత శక్తివంతమైనదని.. ఇది దోషాలను తొలగించి మనసులోని కోరికలను తీర్చుతుంది. విద్యార్థులు లేదా చదువులో విజయం సాధించాలనుకునే వారు స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతున్నారు.
శ్రామణ మాసంలో ఇలా పూజించాలి: శ్రావణంలో శివుడి పూజలో పాలు, పెరుగు, తేనె, గంగాజలం, బిల్వపత్రాలతో అభిషేకం చేయడం అత్యంత ఫలదాయమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు. ఇంట్లో లేదా ఆలయంలో పూజ సమయంలో శివలింగానికి కొంత దూరంగా కూర్చుని శివ చాలీసా పఠించాలి. ఆ తర్వాత శివహారతి చేసి, చివరగా ఏ తప్పులు జరిగి ఉంటే శివుడిని క్షమాపణ కోరాలి. చివరగా మన కోరికలను ఆయనకు తెలియజేయాలని పండితులు అంటున్నారు.
శ్రావణ మాసంలో శివారాధన ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా, భౌతికంగా రెండు విధాలా సుఖ సౌఖ్యాలను పొందుతారు. శివుడి అనుగ్రహంతో బాధలు, ఆర్ధిక సమస్యలు తొలగి, కుటుంబానికి శాంతి, సమృద్ధి లభిస్తాయి. శ్రద్ధగా, నియమంగా శ్రావణంలో శివుడిని ఆరాధిస్తే శివకృప తోడై ఉంటుందని పండితులు అంటున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని ధృవీకరించడం లేదు.)
