జగన్ కు వాళ్ళిద్దరు శుభాకాంక్షలు చెప్పటంలో ఆంతర్యమేంటి ?

పుట్టిన రోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలోని పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలతో ముంచెత్తారు. కానీ ప్రత్యేకంగా ఇద్దరు ప్రముఖులు చెప్పిన అభినందనలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణాలో నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవితలు జగన్ కు ప్రత్యేకంగా అభినందనలు చెబుతూ ట్వీట్లు పెట్టారు.

 

సరే వాళ్ళు అభినందనలు చెప్పిన తర్వాత జగన్ కు వారికి థ్యాక్స్ చెప్పారనుకోండి అది వేరే సంగతి. కానీ పనిగట్టుకుని వాళ్ళిద్దరూ జగన్ కు థ్యాంక్స్ ఎందుకు చెప్పారు అన్నదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే, వాళ్ళిద్దరూ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా అనుకునే వారుండరు. కానీ శుభాకాంక్షలు చెప్పటంతోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ అధికారంలోకి వస్తాడనే ప్రచారం బాగా జరుగుతోంది. కెసియార్ కుటుంబానికి జగన్ బాగా సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ నిజంగానే జగన్ గనుక అధికారంలోకి వస్తే తెలంగాణాలో కెసియార్ కుంటుంబం కన్నా సంతోషించే వాళ్ళుండరు. ఎందుకంటే, కెసియార్ కుటుంబం మొత్తం చంద్రబాబును అంతలా వ్యతిరేకిస్తున్నారు మరి. కాబట్టి కవిత శుభాకాంక్షలు చెప్పారంటే అర్ధముంది.

మరి ఎక్కడో ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, దీదీ మమతా బెనర్జీ ఎందుకు శుభాకాంక్షలు చెప్పారు ? ఎందుకంటే, దీదీ కూడా బహుశా జగనే అధికారంలోకి వస్తాడని అనుకునుంటున్నారేమో ? దానికితోడు ఈమధ్య దీదీకి చంద్రబాబుకు మధ్య సరైన సంబంధాలు లేవు. బిజెపియేతర పార్టీలను ఏకం చేస్తానంటూ చంద్రబాబు మెడలో వీరతాళ్ళేసుకుని దేశమంతా తిరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రయత్నాలను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంట, కాబోయే ప్రధానమంత్రిగా రాహూల్ ను చంద్రబాబు ఎండార్స్ చేస్తున్నారు. ఆ విషయంలోనే చంద్రబాబుపై మమత మండిపడుతున్నారు. అందుకనే చంద్రబాబు ప్రయత్నాలతో మమత కలవటం లేదు.


కాంగ్రెస్ అంటేనే దీదీ మండిపడుతున్న సమయంలో అదే కాంగ్రెస్ ను చంద్రబాబు భుజానేసుకుని మోయటం మమతకు ఏమాత్రం నచ్చటం లేదు. అందుకనే చంద్రబాబు ప్రయత్నాలకు మమత గండి కొడుతున్నారు. బహుశా ఆ విషయంలో చంద్రబాబుపై మమతకు బాగా మంటగా ఉన్నట్లుంది. అందుకనే పనిగట్టుకుని మరీ జగన్ కు శుభాకాంక్షలు చెప్పినట్లున్నారు. మమతకు తాను దగ్గర అని చంద్రబాబు ఒకవైపు కలరింగ్ ఇచ్చుకుంటున్న సమయంలో జగన్ కు మమత అదేపనిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటంలో ఆంతర్యం ఏముంటుంది ?