ప్రత్యేక హోదా : ఎపి కి ప్రధమ శత్రువు ఎవరు?

 

(వి. శంకరయ్య )

ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన చట్టం అమలు పై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. బిజెపి తనను నమ్మించి మోసం చేసిందని ఈ పత్రంలో వాపోయారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎవ్వరికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్ర లోని బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ ఎపికి తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో ఎవరికీ పేచీ లేదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.ఈ ఘోర ఉదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఎంత? ఈ ఖరీదు కట్టేందుకు షరాబులుగా ప్రజలు సిద్ధంగా వున్నారు.

అయితే ఈ సందర్భంగా సామాన్య మానవునికి కూడా పలు సందేహాలు రావడం సహజం.)రాష్ట్ర విభజన చేసింది – అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు తాము తిరిగి అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ నాడే ప్రత్యేక హోదాను చట్టంలో ఎందుకు పొందుపరచ లేదు?తుదకు ఎపికి చట్ట పరంగా ఆర్థిక వనరులు ఎందుకు కల్పించలేక పోయారు? ప్రభుత్వంలో వుంటే ఒక మాట ప్రతి పక్షంలో వుంటే ఒక మాట. ఏలా నమ్మడం? బిజెపి కూడా ఇదే తంతు సాగించింది కదా? ఇందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంజాయిషీ కోసం ఎపి ప్రజలు ఎదురు చూస్తున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రజలు ఏమైపోతారో అనే భయం వుండినదని నేడు ముఖ్యమంత్రి ఆవేదన వెలు బుచ్చు తున్నారు. ఇంత ఆవేదన నేడు వెలు బుచ్చే ముఖ్యమంత్రి ఆనాడు ఎపి కి అన్యాయం జరుగ కుండా ఏవైనా ప్రతి పాదనలు చేశారా?

ఢిల్లీలో దీక్ష అదే సమయంలో బిజెపి నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఎపికి మేలు జరిగే ఓకే ఒక ప్రతి పాదన నైనా చేయలేదు కదా? తను చేసిన ప్రతి పాదనలు ఏమీలేవు. కనీసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది లేదు. మొత్తం వ్యవహారం కాంగ్రెస్ బిజెపి మధ్య జరిగింది. చంద్రబాబు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ స్థితిలో ఎపికి అన్యాయం జరిగిందని వాపోయే అర్హత ముఖ్యమంత్రికి వుందా? ఆ రోజుల్లో ఏం ప్రతి పాదన చేసినా రెండు రాష్ట్రాలో ఎందులోనైనా ఒక దానిలో తన పార్టీ కొంప మునుగు తుందని మిన్న కుండి పోయితుదకుఎపి ప్రజల కొంప ముంచి ఇప్పుడు బీద అరుపులు అరిసితే ఏం లాభం?

ఇవన్నీ సరే. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపితోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని భీష్మించి నటు ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ నాడే ప్రత్యేక హోదా చట్టంలో కలిపితేనే ప్రమాణం చేస్తానని ఎందుకు షరతు విధించలేదు?పోలవరం కన్నా ప్రత్యేక హోదా మిన్న కాదా?

ఇటీవల వరకు కొడుకును ప్రధాని చేయాలని ఎపి గొంతు అడ్డంగా కోసిన రక్కసిగా సోనియా గాంధీని ముఖ్యమంత్రి అభివర్ణించిన రోజులు వున్నాయి. ఇప్పుడు ఆ సుపుత్రుణి ప్రధానిని చేసేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారు. సంపూర్ణ మెజారిటీ వుండి పూర్తి సహకారం ఇచ్చిన ప్రతి పక్షం వుండిన రోజులోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు. 2019 ఎన్నికల తర్వాత అయితే గియితే కాంగ్రెస్ అధికారంలోకిని వస్తే అదీ ఇతర పార్టీల సహకారంతో అధికారంలోనకి వచ్చి ఎపి కి ప్రత్యేక హోదా ఏలా ఇవ్వ కలుగుతుంది?ఆ రోజుల్లో ఏదో ఒక రాష్ట్రంఅంగీకరించ లేదని సాకు చెబితే ఏంకాను? ఎవరి చెవులో పువ్వులు పెట్ట డానికి ఇంత హడావుడి చేస్తున్నారు?

వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర విభజన సమయంలో అచేతనం గా వుండి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాజకీయ స్వార్థంతో అడ్డ దిడ్డంగా రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలో లబ్ది పొందాలని చూసి బోర్ల పడ్డ కాంగ్రెస్ ఇద్దరూ ముద్దాయిగా వుంటారు. అదే సమయంలో నమ్మించి మోసం చేసిన బిజెపి రెండవ ముద్దాయి. కాగా బిజెపి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించితే దానికి స్వాగత సత్కారాలు అందించి మోసం కుట్ర లో పాలు పంచుకున్నందుకు తిరిగి ముఖ్యమంత్రి బిజెపి తో పాటు ప్రజల ముందు ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుంది.

 

(ఇందులోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)