పవన్ కు కేజ్రీవాల్ కి ఎంతతేడా..? అంత తేడా..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆం ఆద్మీ పార్టీని ను ఒకవర్గం రాజకీయ నాయకులు, సామాన్య ప్రజానికం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పార్టీ స్థాపించిన పదేళ్లలోనే జాతీయపార్టీ హోదా దక్కించుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ లిస్ట్ లో తెలుగు జనాలు కూడా ఉండటం గమనార్హం. కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టేవారికి, పెట్టినవారికీ కేజ్రీవాల్ ఒక ఉదాహరణ అని ఆన్ లైన్ లో పోస్టులు పెడుతున్నారు. దీంతో… పవన్ కల్యాణ్ జనసేన అంశం కూడా తెరపైకి వచ్చింది.

రాజకీయాలు చేయాలంటే… “ఆసక్తి మాత్రం ఉంటే సరిపోదు.. దానికి తగ్గ కమిట్ మెంట్ ఉండాలి. కోరిక మాత్రం ఉంటే సరిపోదు.. దాన్ని సాధించడానికి తగిన శ్రమ తోడవ్వాలి. ఆశయాలుంటే సరిపోదు.. అలుపెరగని పోరాటం చేయగలగాలి. అన్నింటికంటే ముందు.. ఇతరుల శక్తిని నమ్ముకోకుండా.. స్వశక్తిపై ఆధారపడాలి.” విచిత్రం ఏమిటంటే… ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ క్వాలిటీస్ అన్నీ కేజ్రీవాల్ లో ఉండగా… ఒక్కటి కూడా పవన్ లో కనిపించకపోవడం!

అవును… పదేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో చిన్న పార్టీగా ఆవిర్భవించిన పార్టీ… జాతీయ హోదా సాధించడం ఒక అద్భుతం అని కేజ్రీవాల్ అంటున్నారు. ఇది కార్యకర్తల విజయంగా ఢిల్లీ సీఎం చెబుతున్నారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికైనా సిద్ధమని ఒట్టేసి మరీ ఆప్ లోకి వచ్చామని.. ఆస్థాయిలో ఉన్న బలమైన సంకల్పమే నేడు జాతీయ హోదాను సాధించి పెట్టిందని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు.

అలా అని పార్టీ స్థాపించే సమయానికి కేజ్రీవాల్ ఏమీ భారీ ఫాలోయింగ్ ఉన్న నేత కాదు.. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరేమీ కాదు.. సినీ గ్లామర్ ఉన్న సూపర్ స్టారూ అసలే కాదు.. జాతీయస్థాయిలో ఫ్యాన్స్ ఉండే క్రీడాకారుడు కానే కాదు! జస్ట్… రాజకీయాలపై ఆసక్తి అండ్ ప్రజాసేవపై కమిట్ ఉన్న వ్యక్తి అంతే!

ఇక పవన్ విషయానికొస్తే.. పార్టీ స్థాపించి పదేళ్లైంది. అధినేత కూడా ఎమ్మెల్యేగా గెలవలేని స్థితి. పార్టీ అధ్యక్షుడికి ఇప్పటివరకూ సొంత నియోజకవర్గం లేని పరిస్థితి. నిత్యం పొత్తులకోసం ప్రాకులాడే దయనీయ స్థితి. ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకీ ఆటలో అరటిపండుగా మారిపోతున్న గతి!

పవన్ కి సామాజిక సేవ చేయాలని, అవినీతి లేని రాజ్యాన్ని చూడాలని బలంగా కోరిక ఉండి ఉంటే ఉండొచ్చు. కానీ… అదొక్కటే సరిపోదు కదా! పైగా… కేజ్రీవాల్ తో పోలిస్తే… పవన్ కు చాలా ప్లస్ పాయింట్సే ఉన్నాయి. పవన్ టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో.. పవన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. తెరపై కనిపిస్తే ఈలలు, ఎదురుగా కనిపిస్తే గోలలు చేసే యువత పుష్కలంగా ఉంది. ఇదే క్రమంలో… రాజ్యాధికారం దక్కక ఎదురుచూస్తున్న బలమైన సామాజికవర్గం తోడుంది.. వారి కోరిక తీరుస్తాడనే బలమైన నమ్మకం ఉంది.

ఇన్ని ఉండి కూడా… పార్టీని ఇప్పటికీ అంపశయ్యపైనే ఉంచాడు పవన్. అప్పుడప్పుడూ ఏపీలో వాలడం.. కాసేపు ఎగరడం.. అనంతరం హైదరబాద్ లో వాలడం. ఇప్పటికీ ఇవే రాజకీయాలు చేస్తున్నారు పవన్. ప్రచార రధం అని ఒకటి తయారుచేయించినా.. దానికి వారాహి అని నామకరణం చేసి కేడర్ లో ఉత్సాహం నింపినా… అనంతరం పూజ చేసి షెడ్ లో దాచిన వైనం!

ఇన్ని మాట్లాడుకున్న తర్వాత ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి… కేజ్రీవాల్ కి ఉన్నది ఏమిటి? పవన్ కు లేనిది ఏమిటి? పార్టీ స్థాపించిన పదేళ్లలో ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా… పార్టీకి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నది కేజ్రీవాల్ అయితే… పార్టీ స్థాపించి పదేళ్లైనా సున్నా ఫెర్మార్మెన్స్ తో కూర్చున్నది పవన్ కల్యాణ్! సో… కేజ్రీవాల్ని చూసుకుని పవన్ ఎంతైనా నేర్చుకోవచ్చు… నేర్చుకోవాలనే కమిట్ మెంట్ ఉంటే…!