Chandrababu Performance: కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ఏమి జరిగిందో చాలామందికి స్పష్టత లేకున్నా… 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. టీడీపీ సత్తా చాటింది. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల హనీమూన్ పిరియడ్ ముగిసింది.. మరి ఇచ్చిన హామీలన్నింటినీ 2025లో చంద్రబాబు అమలు చేశారా..?
జగన్ ఇచ్చిన పథకాలు అన్నీ ఇస్తూ.. అంతకు మించి ఇస్తానన్న మాటలు నిలబెట్టుకున్నారా..?
బంతి బౌండరీ అవతల పడకుండానే “సిక్స్” కొట్టేశామని చెప్పుకోవడంలో సిగ్గు పడటానికి ఏమీ లేదని బాబు భావిస్తున్నారా..?
నిరుద్యోగభృతి, మహిళలకు నెల నెలా ఆర్థిక సహాయం ఏమైనట్లు..? అవి ఇస్తే రాష్ట్ర దివాళా తీస్తుందని అచ్చెన్న లాంటి మంత్రులతో చెప్పిస్తున్నారు.. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తికి హామీలు ఇచ్చే ముందు అవగాహన ఉండదా.. జనం ఇప్పటికీ చంద్రబాబుకు ఎర్రి గొర్రెలేనా..?
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీకి… అధికారంలోకి వచ్చిన తర్వాత “షరతులు వర్తిస్తాయి” అనే ట్యాగ్ లైన్ తగిలించడాన్ని ఎలా చూడాలి..?
రెడ్ బుక్ విషయంలో లోకేష్ కు ఇంత అనుభవం ఉన్న ఆయనకూడా చెప్పలేకపోతున్నారా.. రోజులు అన్నీ ఒకేలా ఉండవని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారా..?
పీపీపీ పేరు చెప్పి.. రాష్ట్రాన్ని తన హయాంలో పూర్తిగా ప్రైవేటు పరం చేసేయాలని ఫిక్సయ్యారా..? టెండర్స్ రాకపోవడం పట్ల ఏమీ అవమానంగా భావించడం లేదా..?

2024 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదనే సంగతి తెలిసిందే. నోటికి ఏది వస్తే అది అన్నట్లుగా.. సాధ్యాసాధ్యాల గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా.. హామీలు ఇచ్చేశారని.. ఇది మోసమనే సంగతి తెలిసినా, కన్నార్ప కుండా అబద్ధపు హామీలు ఇచ్చారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా నడుచుకున్నారు చంద్రబాబు అని అంటున్నారు పరిశీలకులు.
ఇదే క్రమంలో… ఎకరా 99 పైసలకు భూములు కట్టబెడుతున్న వ్యవహారంపైనా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక… పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రజలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే మొండి పట్టుదలపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇది.. చంద్రబాబు సంగతి దేవుడెరుగు.. లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ పై పెను ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
పీపీపీ కి వ్యతిరేకంగా కోటి పైనా ప్రజలు సంతకాలు పెట్టినప్పుడు.. పీపీపీ పేరు చెప్పి టెండర్లు పిలిచినప్పుడు.. ఏ సంస్థా ముందుకు రాకపోయిన విషయాన్ని గమనించి అయినా… పరిస్థితులు, వాస్తవాలు, ప్రజల ఆలోచనలు, పారిశ్రామిక వేత్తల ఉద్దేశ్యాలు చంద్రబాబు అర్ధం చేసుకుని ఉండాల్సిందని అంటున్నారు. ఈ విషయంలో.. ప్రజలను ఏమార్చుతూ, ప్రజలను మోస చేస్తూ.. తనను తాను మోసం చేసుకుంటూ.. లోకేష్ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నారనే విమర్శలు తెరపైకి వస్తుండటం గమనార్హం!!

ఇక వైసీపీ కార్యకర్తలపై పోలీసు కేసులు, సుప్రీంకోర్టు చెప్పినా వినకుండా నిందితులను రోడ్డుమీద నడిపించుకుంటూ తీసుకెళ్లడాలు.. గతంలో తమ కార్యకర్తలు చేసిన పనులే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చేస్తుంటే.. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ఏదో అన్నట్లుగా పోలీసులను ఉసిగొల్పడం వంటివి ముందు ముందు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు!
ఏది ఏమైనా… తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని గతంలో మాదిరిగానే 2025వ సంవత్సరంలో చంద్రబాబు వమ్ము చేసుకున్నారని.. ఈ సమయంలో అయినా, ఈ వయసులో అయినా.. పారిశ్రామిక వేత్తల కోసం కాకుండా, ప్రజల కోసం ఆలోచించి మంచి పేరు తెచ్చుకుని ఉంటే.. చరిత్రలో మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకుంటారని.. అలాకాని పక్షంలో శతకోటి లింగాల్లో బోడి లింగంలా మారిపోయే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు!!

