AP Drugs Issue: శ్రీకాకుళం జిల్లా అంటే కేవలం వలసలకు నిలయం కాకూడదని, అది అభివృద్ధికి అడ్డాగా మారాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. శనివారం ఇచ్చాపురంలో నిర్వహించిన ‘అభ్యుదయ సైకిల్ యాత్ర’ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా పాల్గొన్నారు.
సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని, దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవని ఆరోపించారు. జగన్ హయాంలో అమాయక గిరిజనులను డ్రగ్స్ మాఫియాలో బలిపశువులను చేశారని మండిపడ్డారు.
ఒకప్పుడు వ్యవసాయానికి పేరుగాంచిన పంజాబ్, ఇప్పుడు డ్రగ్స్ వల్ల నాశనమైందని.. ఏపీకి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తోందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు సాంకేతికతను వాడుతున్నామని మంత్రి వెల్లడించారు.

“డ్రోన్ల సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నాం. గతంలో పోలీసులను రాజకీయ వేధింపులకు వాడుకునేవారు. కానీ ఇప్పుడు వారికి సరైన శిక్షణ ఇచ్చి, వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. డ్రగ్స్ కట్టడిలో ఏపీ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు.” – రామ్మోహన్ నాయుడు
నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తల్లులు పడిన ఆవేదనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సిగరెట్లు, డ్రగ్స్ తాగడం స్టైల్ కాదని, నిజాయితీగా ఉండటమే అసలైన స్టైల్ అని యువతకు సూచించారు. ప్రతి ఇంట్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం జరగాలని, ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనేది ప్రతి చిన్నారి నినాదం కావాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తోందని, ఇచ్చాపురం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ సైకిల్ యాత్ర ముగింపు సభను విజయవంతం చేసిన పోలీసులను మరియు కార్యకర్తలను ఆయన అభినందించారు.

