2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయం నుంచి బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు – బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! వీరిద్దరే కేంద్రంగా నిజామాబాద్ లో నిత్యం రాజకీయాలు వేడిలోనే ఉంటుంటాయి. ఇక ఈ ఇరువురు నేతలూ మైకు అందుకున్నారంటే కార్యకర్తల్లో పూనకాలే. ఈ సందర్భంలో కవిత గతంలో ఇచ్చిన కౌంటర్ కు రీకౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ.
2019లో రెండో సారి బీఆరెస్స్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి అర్వింద్ చేతిలో ఓడిపోయిన కవిత… అనంతరం ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా… ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్మూర్ లో పర్యటించిన కవిత.. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురించి చెబుతూ.. తన సోదరుడికి ఎదురొచ్చే వారే లేరని, జీవన్ రెడ్డితో తలపడటం అంటే.. మైసమ్మకు మేకపోతను బలిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.
దీంతో తాజాగా కవిత డైలాగ్స్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ అర్వింద్. తాజాగా ఆర్మూరులో పర్యటించిన ఆయన… 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా కవిత ఇదే డైలాగ్ చెప్పారని, చివరకు ఎవరు బలయ్యారో ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు!
తాజాగా ఈ మధ్యనే బీజేపీలోకి చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకేశ్ రెడ్డితో కలిసి ఆర్మూర్ లో పర్యటించిన ధర్మపురి అర్వింద్.. వచ్చే ఎన్నికల్లో రాకేశ్ రెడ్డి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ర్యాలీకి రాకుండా స్థానిక బీఆరెస్స్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొందరిని బెదిరించారని ఆరోపించిన అర్వింద్… రాబోయే ఎన్నికల్లో 50 వేల ఓట్లతో జీవన్ రెడ్డిని ఓడిస్తామని శపథం చేశారు!
ఈ సందర్భంగా కవితపై కీలక కౌంటర్ వేశారు అర్వింద్. “నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినా… ఎమ్మెల్సీ కవితను ఓడించే బాధ్యత నాది” అని వ్యాఖ్యానించారు! ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ఆన్ లైన్ వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి!