నా సీటుకు నువ్వు ఎసరు పెడితే… నీ సీటుకు నేను ఎసరు పెడతా

పీసీసీ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్న కోమటిరెడ్డిని అడ్డుకునేందుకు పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి బాగానే వర్క్ అవుట్ చేస్తున్నారు. ఉత్తం చర్యలతో కోమటిరెడ్డి బాగానే ఇరిటేట్ అవుతున్నారని సమాచారం. ప్రస్తుతానికి ఈ ఇరువురు నేతలు బయటకు ఒకర్ని ఒకరు విమర్శించుకోలేకపోయినా…. లోలోపల మాత్రం రగిలిపోతున్నారు.

ఈ లోగుట్టు రాజకీయాల కారణంగా నల్గొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెల్వడమే కాకుండా మంత్రిగా ఒకప్పుడు చక్రం తిప్పిన కోమటిరెడ్డి ఇప్పుడు నల్గొండ వైపే చూడడం లేదు. కిందటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కోమటిరెడ్డి ఆతర్వాత అదృష్టం బాగుండి నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ గెలుపుతో ఆత్మవిశ్వాసం పెరిగి ఏకంగా పీసీసీ పదవి పై ఫోకస్ పెట్టారు. ఈ కారణంగా తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన నల్గొండకు చుట్టపు చూపుగానే వస్తున్నారు. ముందు పీసీసీ చీఫ్ పదవిని చేజిక్కించుకొని ఆతర్వాత నల్గొండ పై దృష్టిసారించాలని భావిస్తున్నారు.

కోమటిరెడ్డి తన సీటుపై కన్నేశారని పసిగట్టిన ఉత్తం… ఇప్పుడు నల్గొండలో కోమటిరెడ్డి బేస్ ను కట్ చేసే పనిలో పడ్డారు. చాలా కాలంగా తనకు నమ్మదగిన అనుచరుడిగా ఉన్న దుబ్బాక నర్సింహారెడ్డిని పుల్ గా ఎంకరేజ్ చేసి కోమటిరెడ్డి మీదికి ఉసిగొల్పుతున్నారు. నల్గొండలో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీదుగానే జరిపిస్తున్నారు. గతంలో రెండు సార్లు నల్గొండ అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన దుబ్బాక నర్సింహారెడ్డి …. ఉత్తం రూపంలో వచ్చిన ఈసాయాన్ని పుల్ గా వాడేసుకుంటున్నారు. కోమటిరెడ్డి అనుచరులను పార్టీకి దూరం చేస్తున్నారు. ఈ పరిణామాలను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నా కోమటిరెడ్డి అనుచరులు లోలోపల రగిలిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నల్గొండ టిక్కెట్ దుబ్బాక నర్సింహారెడ్డికే వస్తుందని ఎంపీ కోమటిరెడ్డి ముందు తమ బాధను వెళ్లగక్కుతున్నారు.

ఉత్తం స్ట్రాటజీని బాగా అర్థం చేసుకున్న కోమటిరెడ్డి… ఉత్తం బేస్ ను కట్ చేసే పనిలో పడ్డారు. ఇక్కడ నల్గొండలో గెలుక్కుంటే అక్కడ ఢిల్లీలోని హైకమాండ్ ముందు ఇమేజ్ పాడవుతుందని సైలెంట్ గా ఉంటున్నారు. హైకమాండ్లో ఉత్తంకు మంచి పరిచయాలు ఉండడం…… దానికి తోడు తనపై పార్టీ అగ్రనాయకత్వానికి అంత సదభిప్రాయం లేదని
గుర్తించిన కోమటిరెడ్డి ముందు తన ఇమేజ్ ను బాగు చేసుకునే పనిలో పడ్డారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకొని ఆతర్వాత నల్గొండ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారు.

కోమటిరెడ్డి బలహీనతను పసిగట్టిన ఉత్తం చాపకింద నీరులా… ఇటు జిల్లాలో ఇబ్బంది పెట్టడంతో పాటు అటు ఢిల్లీలో హైకమాండ్ వద్ద కోమటిరెడ్డికి ఉన్నగ్యాప్ ను మరింత పెంచే పనిలో పడ్డారు. దీంతో ఈపాటికే ఓపిక నశించిపోయినా చేసేది లేక కోమటిరెడ్డి మౌన ముద్ర వీడడం లేదు. ఒక వేళ పీసీసీ పీఠం తనకు దక్కకపోతే హైకమాండ్ విషయాన్ని మర్చిపోయి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు జిల్లా రాజకీయాల్లో ఫూర్తి స్థాయిలో దిగిపోవాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉత్తంను ఢిల్లీలో కాకుండా నల్గొండ వీధుల్లో ఢీ కొట్టాలని కుతకుతలాడుతున్నారు.