విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జనసేనాని డబుల్ టోన్.!

Pawan Kalyan
Pawan Kalyan
Pawan Kalyan
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జనసేనాని డబుల్ టోన్.!

ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని, ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు వ్యాపారం చెయ్యలేవు. వాటికి నిధులు సమకూర్చడం అనేది కష్టతరమవుతోంది. ఇది జాతీయ విధానం. కేవలం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ఉవాచ.

అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని జనసేన అధినేత స్వయంగా చెబుతున్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించరాదంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన వైనాన్నీ సెలవిచ్చారు. ఇంతా మాట్లాడి, విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ రాజకీయం కేవలం మునిసిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునేనని విమర్శంచడమే కొంత అభ్యంతరకరంగా మారింది. నిజమే, వైసీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా విశాఖ ఉక్కు కోసం పోరాడాల్సి వుంది. ఇప్పటిదాకా అయితే ఆ పని చేయలేదు. అలా వారు ఉద్యమించకుండా ఉండటానికి ఏ ఒత్తిళ్ళు వారిపై పనిచేస్తున్నాయో ఎవరికీ తెలియదు.

అయితే, ముందు ముందు వైసీపీ ఈ విషయంలో ఉద్యమించకుండా వుంటుందని ఎలా అనుకోగలం.? కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు గనుక, కేంద్రం నుంచి సమాధానం వచ్చేవరకూ వైసీపీ ఎంపీలు వేచి చూడటం అనేది సర్వసాధారణమైన విషయమే. జనసేన అధినేత ఢిల్లీకి వెళ్ళొచ్చారు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఉక్కు పరిశ్రమ విషయమై కలిశారు. మరి, అట్నుంచి ఏం సమాధానం వచ్చింది.? ఈ సంగతిపై జనసేన అధినేత క్లారిటీ ఇవ్వాల్సి వుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ రాజకీయ కోణంలో చూసినా దానికి తగిన శిక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది. ప్రజలు అమాయకులని ఏ పార్టీ అనుకున్నా పొరపాటే.