వినాయక చవితి నాడు.. పొరపాటున చంద్రుడిని చూస్తే వెంటనే ఇలా చేయండి..!

వినాయక చవితి అనగానే అందరి మనసులో వినాయకుడి విగ్రహాలు, పూజలు, ప్రత్యేక అలంకరణలు, ఉత్సవాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ పండుగకు సంబంధించిన ఒక నమ్మకం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఇప్పటికీ కచ్చితంగా పాటిస్తూ వస్తున్నారు. అది ఏమిటంటే చవితి రోజున చంద్రుడిని చూడరాదు అన్న ఆచారం. ఎందుకంటే ఆ రోజున చంద్రుడిని చూసినవారు అనుకోని సమస్యలు, నీలాపనిందలు, తప్పుడు ఆరోపణలకు గురవుతారని విశ్వాసం.

పురాణాల ప్రకారం వినాయకుడు ఒకసారి కుడుములు, ఉండ్రాళ్లు తిని కడుపు నిండా మూషికవాహనంపై ప్రయాణిస్తుండగా తడబడి బోర్లాపడ్డాడు. అప్పటి వరకు తిన్న కుడుములన్నీ బయటపడ్డాయి. ఈ దృశ్యం చూసి శివుడి శిరస్సు మీద అలంకరించి ఉన్న చంద్రుడు పగలబడి నవ్వాడు. దీనితో ఆగ్రహించిన పార్వతీ దేవి చంద్రుడిని శపించి, “వినాయక చవితి నాడు నిన్ను చూసినవారు నీలాపనిందలకు గురవుతారు” అని ఆంక్ష పెట్టింది.

ఈ శాపం వల్ల ఆ రోజున చంద్రుడిని చూసిన వారు ఇబ్బందులు పడతారు, తప్పుడు ఆరోపణలకు గురవుతారని నమ్మకం. ఈ దోషం కారణంగా పురాణాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి శ్రీకృష్ణుడు వినాయక చవితి రోజున చంద్రుడిని చూసి అనవసర నిందలకు గురయ్యాడు. అలాగే సప్తరుషుల భార్యలూ ఇదే కారణంతో సమస్యలను ఎదుర్కొన్నారు.

ఈ సమస్యను నివారించేందుకు ఒక పరిహారం కూడా ఉంది. వినాయక చవితి రోజున వినాయకుని జన్మకథను పూర్తిగా విని, అక్షింతలు వేసుకోవడం ద్వారా చంద్రదోషం నుంచి విముక్తి పొందవచ్చని రుషులు సూచించారు. అంతేకాక ఆ రోజంతా ఉపవాసం చేయడం, భక్తిశ్రద్ధలతో “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని జపించడం కూడా అత్యంత శ్రేయస్కరంగా పరిగణించబడింది.

చంద్రుడిని పొరపాటున చూసిన వారు తప్పక వినాయక చవితి వృత్తాంతం వినాలని, అక్షింతలు వేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారం వేలాది ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భక్తుల నమ్మకంలో వినాయకుని ఆరాధనతో పాటు ఈ పరిహారాలు చేస్తే ఎటువంటి నీలాపనిందలు, దోషాలు దరిచేరవని విశ్వాసం బలంగా ఉంది. కాబట్టి వినాయక చవితి రోజున భక్తులు పూజలు చేస్తూనే చంద్రుని చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. వినాయకుని కటాక్షం కలిగితే దోషాలన్నీ తొలగిపోతాయని, భక్తుల జీవితం సుఖశాంతులతో నిండిపోతుందని పెద్దలు చెబుతూ వస్తున్నారు.