ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వసన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకల సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా, ఆగస్టు 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:
ఉదయం 7 గంటల నుండి కంట్రోల్ రూమ్ నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలను ఆర్.టి.సి. వై జంక్షన్ వద్ద ఏలూరు రోడ్డు మీదుగా చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపు మళ్లిస్తారు. బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్డులోకి వచ్చే వాహనాలను ఫకీర్‌గూడెం, స్క్రూ బ్రిడ్జ్, నేతాజీ బ్రిడ్జ్ మీదుగా బస్టాండ్ వైపునకు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్.టి.ఎ. జంక్షన్ వరకు మరియు శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు. మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్ల నుంచి పాత కంట్రోల్ రూమ్ వరకు ఆటోలను అనుమతించరు. వేడుకలకు హాజరయ్యే AA, A1, A2, B1, B2 పాస్ హోల్డర్లు తమకు నిర్దేశించిన మార్గాలలోనే స్టేడియానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
“స్త్రీ శక్తి” పథకం ప్రారంభోత్సవం:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, సాయంత్రం 5 గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “స్త్రీ శక్తి” పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,700 బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే, నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి (తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు.


