విజయశాంతి – ఉట్టికి ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేస్తుందంట

గత కొంత కాలంగా విజయశాంతి పార్టీ మారతారు అంటూ వస్తున్న వార్తలను పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తుంది. విజయశాంతికి ఓట్లు రాల్చేంత శక్తి లేదని తేలిసే తెలంగాణ పీసీసీ నేతలు ఆమెను లైట్ తీసుకున్నారని సమాచారం. అయితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి ఇంటి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నప్పటి నుంచి విజయశాంతి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దీంతో ఒక్కసారిగా ఆమె శక్తి, సామర్థ్యం, రాజకీయాల్లో నెట్టువచ్చేందుకు ఉన్న అర్హతలపై చర్చ మొదలైంది.

ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా మంచి స్థానంలో ఉన్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఆమె ప్రచారం చేసిన చోట వచ్చిన స్పందన తదునుగుణంగా వచ్చిన ఓట్లు తదితర అంశాలను కాసేపు పక్కన పెడితే… ప్రస్తుతం దుబ్బాకలో ఉపఎన్నికలు జరుగుతున్నా ప్రచార కమిటీ ఛైర్ పర్సన్  హోదాలో ఉండి కూడా విజయశాంతి వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది.

గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతి ఒకప్పటి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉపఎన్నికలు వచ్చినా ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రచార కమిటీ చైర్ పర్సన్ హోదాలో ఉండి కూడా రాకపోవడం సరికాదని తప్పుపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.  

అసలు రామూలమ్మను రాజకీయ పార్టీలే ఎక్కువగా ఊహించుకుంటున్నాయే తప్ప ప్రజలు ఆమె ప్రకటనలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లేడీ అమితాబ్ గా పేరుతెచ్చుకున్న విజయశాంతి బీజేపీ, తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. సరిగ్గా ఎన్నికల ముందు చేరడంతో సినిమాతార కావడంతో స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. అయితే ఈ స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతికి స్వతహాగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేదని చాలా మంది అభిప్రాయం. గతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ చరిష్మా, టీఆర్ఎస్ కార్యకర్తల బలంతో ఎంపీగా గెలిచారే తప్ప స్వతహాగా ఆమెకు అంత శక్తి లేదని టాక్.

అందుకే రాష్ట్ర పీసీసీ నేతలు ఆమెకు అంత ప్రయారిటీ ఇవ్వడం మానేశారు. దీంతో రాములమ్మ కూడా గాంధీ భవన్ కు రావడం మానేసింది.  దుబ్బాక ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది.  మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతి అదే పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేస్తే గెలుస్తుందా లేదా అన్నది కాంగ్రెస్ వర్గాలు సమాలోచనలు చేశాయి.  అయితే అసలు ఆమెకు అనుచరణ గణం, కార్యకర్తల బలం ఎక్కడుందని ప్రశ్నించారంటా దుబ్బాక స్థానిక నాయకులు. క్యాడర్ బలం లేని ఆమెకు టికెట్ ఇస్తే తాము సహకరించమని తెగేసి చెప్పేశారంటా . అదండీ విషయం. ఈ పరిణామాలతో సీరియస్ అయిన రాములమ్మ ఉపఎన్నికల ప్రచారానికే డుమ్మా కొట్టేస్తోంది.

రాములమ్మకు ఇన్నాళ్లు ఆమె స్థాయి కంటే ఎక్కువే ప్రాముఖ్యతను ఇచ్చినా… దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు విజయశాంతి హ్యాండ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటా కాంగ్రెస్ నేతలు.  ఉండి కూడా దుబ్బాకలో ప్రచారానికి పోలేదు. మరోవైపు ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా విజయశాంతి ఇంటికెళ్లి మరీ బీజేపీలో చేరాలని సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే తేరుకున్న పీసీసీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి విజయశాంతిని బుజ్జగించారు. దీంతో మెత్తబడ్డ  విజయశాంతి సోషల్ మీడియాలో దుబ్బాకలో టీఆర్ఎస్ దురాగతాలను ఎండగడుతూ నిన్న ట్వీట్ చేశారు. కింద ‘కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్’ అని రాసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక రాములమ్మ కాంగ్రెస్ లో ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అయితే.. చాలా కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో అంత పెద్దగా యాక్టివ్ రోల్స్లో పోషించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ముఖ్యులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ లో ఉన్నప్పుడు మెదక్ ఎంపీగా గులాబీ పార్టీ బలంతో గెలిచారు విజయశాంతి. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాక మెదక్ ఎంపీ మెదక్ ఎమ్మెల్యేగా పోటీచేసి రెండు సార్లు ఓడిపోయారు. మెదక్ జిల్లాలో అసలు విజయశాంతికి ఓట్లు లేవు.. క్యాడర్ కూడా లేని పరిస్థితి ఇప్పుడు నెలకొందని నేతలు చెబుతున్నారు.