రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి, తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఒకప్పుడు ఈ జట్టును స్థాపించిన విజయ్ మాల్యా కూడా ఈ సంధర్భంగా స్పందించారు.
ఆర్సీబీకి వ్యవస్థాపక యజమానిగా ఉన్న విజయ్ మాల్యా, 2008లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసి, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్లతో జట్టును రూపొందించారు. ఆ జట్టు ప్రయాణం గురించి మాల్యా ‘ఎక్స్’లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “ఆర్సీబీ స్థాపించినప్పుడు ట్రోఫీ గెలవాలన్నదే నా కల. ఇప్పుడు అది నెరవేరింది. బెంగళూరు ఫ్యాన్స్‌కి ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. అభినందనలు” అంటూ పేర్కొన్నారు.
2016లో ఆర్థిక మోసాల ఆరోపణలతో మాల్యా దేశం విడిచి వెళ్లినప్పటికీ, ఆర్సీబీపై ఉన్న భావోద్వేగాన్ని ఈ సందేశం ప్రతిబింబిస్తోంది. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలువిధాలుగా స్పందించారు. కొందరు మాల్యా చేసిన కృషిని గుర్తు చేస్తూ ప్రశంసిస్తే, మరికొందరు ఆయన పరారీ జీవితం గురించి కామెంట్లు పెట్టారు. అలాగే పలు రకాల మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కానీ వాటిపై మాల్యా పెద్దగా రియాక్ట్ కావడం లేదు.