మంచి ఆదాయం వస్తున్నా.. నెలాఖరుకు మీ బ్యాంక్ ఖాతా ఖాళీగానే అవుతోందా. ఎంత జాగ్రత్తగా ఖర్చుపడినా, ఏదోలా డబ్బు మాయం అవుతుంది. పొదుపు చెయ్యాలను కుంటే ఏదో ఒక అవాంతరం వస్తోందా.. నిజానికి మీ ఆదాయంలో లోపం ఉండకపోయినా.. ఆర్థికంగా ముందుకెళ్లలేకపోతుంటే… కారణం మీ ఇంట్లోనే దాగి ఉండే వాస్తు లోపం కావచ్చని మీరు ఎప్పుడైనా ఊహించారా. ఈ కథనంలో దాని గురించి తెలుసుకుందాం.
వాస్తు అనేది కేవలం ఇల్లు ఎలా కట్టాలి అన్న మార్గదర్శకం మాత్రమేకాదు. అది శాంతి, ఆరోగ్యం, ధనం వంటి అంశాలపై ప్రభావం చూపే జీవనశైలి. డబ్బు ఎలా సంపాదించాలో కాకుండా, సంపాదించిన ధనం ఎలా నిలుపుకోవాలో వాస్తు చెప్పే పద్ధతులు సహాయపడతాయి. చాలామంది తమ సేఫ్‌ను లేదా నగదు నిల్వలను చీకటి మూలల్లో, మూసివేసిన అల్మారాల్లో దాచిపెట్టే అలవాటు కలిగి ఉంటారు. భద్రత కోసం ఇది సరైనదేమో కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. చీకటి ప్రదేశాల్లో ఉన్న డబ్బు శక్తివంతమైన సానుకూల తరంగాలను పొందలేక, ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి వెలుతురు, శుభ్రత, శాంతిని ఇష్టపడుతుంది. అందుకే డబ్బు ఉండే ప్రదేశం శుభ్రమూ, ప్రకాశమానమూ ఉండాలి.
అలాగే, బాత్రూమ్ దగ్గర డబ్బును ఉంచడం కూడా మరో పెద్ద వాస్తు లోపం. నీటి శక్తి అధికంగా ఉండే ప్రదేశాలు స్థిరత్వానికి భంగం కలిగిస్తాయి. ఇది డబ్బు నిలిచే శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా బాత్రూమ్ వద్ద సేఫ్ తలుపు నేరుగా టాయిలెట్ వైపు ఉండకూడదు. ఉత్తర దిశలో, కుబేరుని దిశగా సేఫ్‌ను ఉంచడం శ్రేయస్కరం. ఆ ప్రదేశంలో ఎప్పుడూ శుభ్రత పాటించాలి. అక్కడ చెత్తపదార్థాలు, పాత వస్తువులు, విరిగిన వస్తువులు ఉండకూడదు. ప్రతిరోజూ దీపం వెలిగించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు.
ఇంకో ముఖ్యమైన విషయం బహుమతులతో వచ్చిన వస్తువులను కూడా సేఫ్‌లో ఉంచడం అంత మంచిది కాదు. శుభలక్షణంగా కనిపించినా, వాటిపై ఇతరుల శక్తి ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటిని డబ్బుతో పాటు ఉంచడం వల్ల ఆర్ధిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంటుంది. వాటిని వేరుగా, శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం ఉత్తమమని చెబుతున్నారు.
ఈ చిన్నచిన్న మార్పులతో మీ ఇంట్లో శ్రేయస్సు అలవోకగా నిండి పోవచ్చు. డబ్బు నిలవకపోతే పని, ఆదాయాన్ని మాత్రమే కాదు మీ ఇంటి వాతావరణాన్ని కూడా ఒక్కసారి పరిశీలించండి. మీరు లక్ష్మీదేవిని సంతోషపరచాలంటే, ఆమెకు ఇష్టమైన క్రమశిక్షణ, వెలుతురు, శుభ్రత మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. వాస్తు పాటించడం ఒక నమ్మకంగా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం జీవితాన్ని మార్చే స్థాయిలో ఉంటుంది.
