ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దివంగత కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు నేడు (ఆదివారం) ప్రకటించారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, ఇకపై ప్రజా జీవితంలోనే తన ప్రయాణమని ఆమె స్పష్టం చేశారు.
నేడు విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న తన తండ్రి వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడారు. “గత కొంత కాలంగా నేను ప్రజా జీవితానికి దూరంగా ఉన్నాను. కానీ, ఇకపై నా పూర్తి ప్రయాణం ప్రజలతోనే ఉంటుంది. విజయవాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, నేను వారికి అండగా ఉంటాను” అని ఆశా కిరణ్ భరోసా ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణాన్ని వివరిస్తూ, “రాధా, రంగా మిత్రా మండలిల మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమే. ఆ ఖాళీని పూర్తి చేయడమే నా లక్ష్యం. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా సాయం కోరి వచ్చిన వారందరిని నా తండ్రి రంగా, అన్నయ్య రాధా ఆదుకున్నారు. నేను కూడా వారి మార్గంలోనే నడుస్తాను” అని ఆమె పేర్కొన్నారు.

తాను ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై నేను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు” అని ఆశా కిరణ్ వెల్లడించారు. ఆశా కిరణ్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
వంగవీటి రంగా మరణానంతరం ఆయన సతీమణి రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన క్రియాశీలకంగా లేరు.
ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో, ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

