IndiGo CEO: గత వారం రోజులుగా ఇండిగో విమానాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఒకేసారి వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోవడం, లక్షల మంది ప్రయాణికుల పరిస్థితి ఒక్కసారిగా తారుమారవ్వడం, దేశ విమాన ప్రయాణంపై తీవ్ర ప్రభావం చూపి, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఈ క్రమంలో… తప్పు పూర్తిగా ఇండిగోదేనా?
ఇప్పుడు ఈ దిశగానే దేశ వ్యాప్తంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు?
ఇండిగోలో సమస్య వచ్చింది.. అది కచ్చితంగా సమర్ధనీయం కాదు.. ఇందులో ఏవియేషన్ మంత్రిత్వ శాఖ వాటా ఏమీ లేదా?
కొత్త విమానాలు కొనుగోలు చేయకుండానే రూట్లు పెంచుకునే విషయంలో అనుమతి ఇచ్చింది ఆ మంత్రిత్వ శాఖ కాదా?
అంటే.. తాజా సమస్యలో సదరు మంత్రిత్వ శాఖ ప్రజలకు క్షమాపణ చెప్పడం, బాధ్యతాయుతమైన వ్యక్తిగా తన మంత్రి పదవికి రాజీనామా చేయడం సరైంది కాదా?
తనకు ఇండిగో సీఈఓ దండం పెడుతున్న ఫోటోను షేర్ చేసిన మంత్రి రామ్మోహన్ రావు… వాస్తవంగా తాను ఎవరికి దండం పెట్టాలి?

రైలు ప్రమాదం జరిగినప్పుడు ఆ రైలును లోకో పైలెట్ నడుపుతుంటారు. ఆ డిపార్ట్ మెంటుకు సంబంధించిన అధికారులు ఆఫీసులో ఉంటారు! సంబంధిత మంత్రి ఢిల్లీలో ఉంటారు. అయినప్పటికీ… ఆ రైలుకు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన రైల్వే మంత్రులు ఈ దేశంలో ఉన్నారు. అది వారి తప్పిదంగా అంగీకరించారు.. అది తమ నైతికత గా ఫీలయ్యారు! మరి కేంద్రం పౌర విమానాయన మంత్రి చేస్తున్నదేమిటి?
అలా అని ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయమని కాదు.. తన హయాంలో విమానయాన శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ ఆయనే ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా అనేది ఇక్కడ పాయింట్.
రాజమండ్రిలో ఎయిర్ పోర్టులో కొత్తగా నిర్మిస్తున్న కట్టడం కూలిపోయింది.. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం.. ఎన్నో విమానాలు సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన పరిస్థితి నెలకొంది.

వీటన్నింటికీ సాంకేతిక లోపాలే కారణం అయినప్పుడు.. ఆ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ఏ శాఖది.. ఆ శాఖకు మంత్రి ఎవరు? ఆయనకు బాధ్యత లేదా? ప్రజలకు క్షమాపణ చెప్పడం వల్లో, ఆయన చెప్పించుకోవడం వల్లో, ఆ ఫోటోనే బయటకు వదలడం వల్ల ఒరిగేదేమిటి?
మరోపక్క… ‘ఆయన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అయితే.. నేషనల్ మీడియా ఇలానే ప్రశ్నిస్తుందా?’ అనే నిస్సిగ్గు వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులకు తెలుగు నేలలు స్థానాలుగా మారిన పరిస్థితి!
ఈ క్రమంలో… ఇండిగో విమాన షెడ్యూళ్లలో 10 శాతం కోత విధిస్తున్నట్టు మంగళవారం మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండిగో విమాన సేవలను స్థిరీకరించడం.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. ఈ పని ముందే ఎందుకు చేయలేదు. ఇండిగో విమాన షెడ్యూళ్లు పెరిగిన విషయం ముందుగా సదరు శాఖా మంత్రికి తెలియదా?

ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన తీవ్ర జాప్యాలు, రద్దుల కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అది కరక్టే! మరి బాధ్యతగల మంత్రిగా ఆ శాఖ పనితీరుపై పక్కా ప్లానింగ్ తో ఉండాల్సిన మంత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే కామెంట్లకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు.
ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే… తాజాగా ఇండిగో వల్ల దేశ ప్రజలకు జరిగిన ఇబ్బందుల్లో తప్పు పూర్తిగా ఆ సంస్థదే కాదు.. సదరు మంత్రిత్వ శాఖది కూడా అనే చర్చకు అవకాశం బలంగా ఇచ్చారని!
వాస్తవానికి చిన్న వయసులోనే కేంద్రమంత్రిగా తెలుగువాడు రామ్మోహన్ కి అవకాశం రావడం అంతా సంతోషించే, గర్వించే విషయమే. కానీ.. అదే సమయంలో తెలుగుమంత్రి అసమర్థుడు అనే పేరు జాతీయస్థాయిలో తెచ్చుకునే పరిస్థితులు రావడం కచ్చితంగా విచారించే, నిలదీసే, అవమానకర విషయమే! ఈ సమయంలో ఈ అనుభవాల నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుని.. కేంద్రమంత్రిగా ఇకనైనా అటు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి.. వారు తిట్టుకునే పరిస్థితి.. ప్రతిపక్షాలు, మీడియా కాలర్ పట్టుకుని నిలదీసే పరిస్థితి తెచ్చుకోకూడదని కోరుకుందామ్..!

