తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్టీలో విభేదాలు, అసంతృప్తి పెరిగిపోతుండటం హస్తం శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోల్, ఎమ్మెల్యేల రహస్య సమావేశం కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇటీవలి కాలంలో ప్రజా మద్దతు ఏ విధంగా మారుతోందో అర్థం చేసుకునేందుకు అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో కాంగ్రెస్ ఓ పోల్ నిర్వహించింది. అయితే అందులో 70% పైగా ఓట్లు “ఫామ్ హౌస్ పాలన” కు మద్దతుగా రావడం పెద్ద చర్చగా మారింది. ఇది బీఆర్ఎస్ హ్యాక్ చేసి చేసిందా? లేక నిజంగానే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
దీంతోపాటు మరో కీలక అంశం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కీలక మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ నియోజకవర్గాల్లో తామెవరనేది పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీ విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. దీనిపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఇది చిన్న విభేదమని చెప్పినా, అసలు కారణాలు మరేదో ఉన్నాయన్న అనుమానం పార్టీ పెద్దలలో ఉంది.
ఇక మంత్రులు, జిల్లా ఇన్‌చార్జ్‌ల మధ్య సమన్వయం లేకపోవడం ఎమ్మెల్యేలకు కష్టంగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో స్థానిక మంత్రులు లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారని, పలువురు ఎమ్మెల్యేలు తమకు సముచిత గౌరవం లభించడం లేదని వాపోతున్నారని సమాచారం. దీనిపై రేవంత్ రెడ్డి తక్షణమే సమీక్ష నిర్వహించారని, విభేదాలను సద్దుమణిగేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తిని నివారించేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా, వర్గపోరు, ఇగోలు అదుపులోకి రాకపోతే, ఇది ప్రభుత్వం పని తీరుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ ఏకతాటిపై కొనసాగాలంటే నేతల మధ్య ఉన్న విభేదాలను త్వరగా పరిష్కరించడం కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారింది.