బీజేపీ ఆశించింది – కాంగ్రెస్ కోరుకుంది… కేసీఆర్ కి తగిలేసింది!

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ముందు అధికారపార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతినే కార్యక్రమం ఒకటి తెలంగాణలో జరిగింది. ఇప్పటికే పుష్కలంగా ఉన్న పార్టీ అంతర్గత సమస్యలు, వాటికి తోడు అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్రతో అపసోపాలు పడుతున్న అధికార పార్టీకి.. అవి చాలవన్నట్లు తాజాగా మరో గట్టి షాక్ తగిలింది. అందుకు కారణమైంది… ఎమ్మెల్సీ ఎన్నిక!

అవును… తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి అయిన గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇలా బీజేపీ ఈ ఎన్నికలలో విజయం సాధించి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో… అధికార బీఆరెస్స్ పై ప్రభుత్వ ఉద్యోగులు, అందునా ఉపాధ్యాయులు ఏ స్థాయి వ్యతిరేకతలో ఉన్నారన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం అయ్యిందనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో… ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్.. వాటిని నెరవేర్చలేదని, ఆ కోపమే ఈ ఫలితాలకు కారణం అని కామెంట్లు మొదలైపోయాయి. బీజేపీ సపోర్ట్ చేసిన ఏవీఎన్ రెడ్డి విజయానికి ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే ప్రతీ ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వచించదు. వీలైనంతవరకూ వారిని ప్రసన్నం చేసుకోవడానికే చూస్తుంటాయి. కానీ తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందనే విమర్శ ఉంది.

దీంతో… మొత్తానికి బీజేపీ నేతలు ఆశించినట్లు, కాంగ్రెస్ నేతలు కోరుకున్నట్లు.. తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మేధావుల మద్దతు అధికార బీఆరెస్స్ కు వ్యతిరేకంగా ఉందని మాత్ర స్పష్టమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కాగా… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. అసెంబ్లీలో బీఆరెస్స్ కున్న మెజారిటీ కారణంగా ముగ్గురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే!