డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుండగా… అటు బీజేపీ నేతలు రాజకీయంగా ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఉదయనిధి వ్యాఖ్యలను వక్రీకరించే పనికి పూనుకున్నారు.
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏకంగా ప్రధాని మోడీ స్పందించారు. డీఎంకే మంత్రి సనాతన ధర్మం వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందిస్తూ ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దీంతో… మణిపూర్ మొత్తం అట్టుడికిపోతుంటే ఫిడేల్ వాయించిన మోడీ.. ఈ విషయంపై మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
ఆ సంగతి అలా ఉంటే… ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, పైత్యం మొత్తం చూపించే పనో ఏమో ఒక ట్వీట్ చేశారు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా. అసలు ఉదయనిధి చెప్పిన దానీకీ.. ఆయన ట్వీట్ కీ ఎక్కడా పొంతనలేకపోవడంతో.. వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా అమిత్ మాల్వియా ట్వీట్ ఉందని ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
అమిత్ మాల్వియా ట్విటర్ లో ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ… “తమిళనాడు సీఎం కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న భారతదేశంలోని 80% జనాభాను ఉచకోత కోయాలని ఆయన (ఉదయనిధి) అనుకుంటున్నారు. తన అభిప్రాయాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాల్సిందే” అని అన్నారు.
దీంతో… అసలు ఊచకోత వంటి పదాలు ఉదయనిధి వాడలేదని వివరణ వచ్చింది. ఇందులో భాగంగా ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, సనాతన ధర్మం వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడానని మంత్రి వివరణ ఇచ్చారు.
ఈ సమయంలో సనాతన ధర్మంపై చేసిన తన వాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశ్యంతో రెండు వర్గాల మధ్య హింస, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉదయనిధి వ్యాఖ్యలను అమిత్ మాల్వియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు చేశారు. దీంతో మాల్వియాపై ఎఫ్.ఐ.ఆర్ దాఖలైంది.
దీంతో… ఉదయనిధి వ్యాఖ్యలతో బీజేపీ నేతలకు కొబ్బరి చిప్ప దొరికినట్లయ్యిందని, ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఎవరికి తోచిన రీతిలో వారు మతరాజకీయాలు చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి!