బంగారం, వెండి, మట్టి, స్పటిక.. శ్రావణ మాసంలో ఏ శివలింగాన్ని పూజించడం శుభప్రదం..!

శ్రావణ మాసం శివుని అనుగ్రహం లభించే పవిత్రమైన కాలం. హిందూ ధర్మంలో పరమ శివుడిని విశ్వ సృష్టికర్తగా, ప్రళయ రూపంగా, మళ్లీ సృష్టి కర్తగా పూజిస్తారు. ఈ నెలలో శివుడి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో భాగంగా శివలింగ పూజకు అపార ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి భక్తుడికీ తెలియని ఒక విషయం ఏమిటంటే, శివలింగాలు వేర్వేరు పదార్థాలతో తయారవుతాయి. వాటి ద్వారా భక్తులు పొందే ఫలితాలూ భిన్నంగా ఉంటాయి. ఈ కథనంలో వాటి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వెండి, బంగారం, మట్టి, స్ఫటికం, పాదరసం, ఇత్తడి వంటి పదార్థాలతో తయారైన శివలింగాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వేరు వేరుగా ఉంటాయి. వెండి శివలింగం మానసిక శాంతికి చిహ్నంగా భావించబడుతుంది. దీనిని పూజించడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయని నమ్మకం. అలాగే బంగారు శివలింగం సంపద, శక్తి, రాజసంతోసానికి ప్రతీక. ధనాభివృద్ధి కోరుకునే వారు దీనిని పూజిస్తారని పండితులు చెబుతున్నారు.

ఇక మట్టి శివలింగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో దీనిని పూజిస్తే కోరికలు తీరడం మాత్రమేగాక, మోక్షానికి దారితీస్తుందని విశ్వాసం. కోటి యజ్ఞాల ఫలాన్ని ఇస్తుందని పురాణాల వివరాలు చెబుతున్నాయి. ఇక స్ఫటిక శివలింగం పారదర్శకమైన శుద్ధత, శాంతి, ధనసౌఖ్యం నిచ్చే రూపం. లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునే వారు దీన్ని పూజిస్తారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నివారణకు ఇది శ్రేష్ఠమని అంటారు. అదే విధంగా, పాదరసం శివలింగంను అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది శివుని జీవ స్వరూపమేనని అర్చకులు చెబుతున్నారు. అయితే దీన్ని పూజించేందుకు కఠినమైన నియమాలు, ఆచారాలు ఉండే కారణంగా సాధారణ భక్తులు కాకుండా నియమితులైన వారు మాత్రమే దీనిని ప్రతిష్ఠిస్తారు.

శివారాధన అనేది భక్తి మాత్రమే కాదు, పరిపక్వత, నియమంతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ఏ శివలింగాన్ని ఎంచుకుంటారో… అది మీ శ్రద్ధ, అవసరం, నమ్మకాన్ని ఆధారపడి ఉంటుంది. అయితే వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానం తెలుసుకొని పూజిస్తే ఫలితం శతగుణాలుగా దక్కుతుందని ఋషులు చెబుతున్నారు.
శ్రావణ మాసంలో శివలింగాన్ని పూజించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయన్న నమ్మకంతో భక్తులు తమ శక్తి మేరకు ఈ విభిన్న శివలింగాలను ప్రతిష్టించి, నియమబద్ధంగా ఆరాధిస్తూ ఉంటారు.