ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరం.. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ వ్యాధులు దూరం..!

ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఉపయోగ పడే మొక్క తులసి. చిన్నతనంలో మనందరి ఇంట్లో ఓ మూలలో తులసి మట్టిబండ తప్పకుండా ఉండేది. ఉదయం దానికి దీపం వెలిగించి భక్తితో నమస్కరించే దృశ్యాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అయితే ఈ మొక్కపై మన పెద్దలు చూపిన భక్తి కేవలం ఆధ్యాత్మిక కారణాలతోనే కాదు. దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇప్పుడు ప్రపంచమంతా తెలుసుకుంటోంది.

తులసి మొక్క సులువుగా ఇంట్లో పెంచుకోవచ్చు. కాస్త ఎండ, నీరు ఉంటే చాలు బాగా పెరుగుతుంది. కానీ ఈ చిన్న మొక్క చేసే మేలుకు మాత్రం అవధులు లేవు. మొదటగా చెప్పుకోవాల్సింది స్ట్రెస్‌కి దీనివల్ల చక్కటి పరిష్కారం దొరుకుతుంది. తులసి నుంచి వచ్చే వాసనలోనే మానసిక ప్రశాంతత దాగి ఉంది. అందుకే దీనిని “అడాప్టోజెన్” అంటారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు తులసి వాసన మన నరాలను ప్రశాంతంగా చేస్తుంది. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి దళాలతో తయారుచేసే టీ రోజు తాగడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. యుగెనాల్, యుర్సోలిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన ఫైటోకెమికల్స్ తులసిలో ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

తులసి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. హై బీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలోనూ తులసి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరం లాంటిదే.

పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారికీ తులసి అద్భుతం. గ్యాస్, అసిడిటీ, అజీర్నం వంటి సమస్యలకు ఇది చక్కటి నివారణ. తులసి లీవ్స్ జీర్ణశక్తిని మెరుగుపరచే ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. దీంతో ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. అంతేకాక, లివర్‌ను డిటాక్స్ చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

ఇంకా చెప్పాలంటే, తులసి ఒక నేచురల్ ఎయిర్ ప్యురిఫైయర్‌. ఇది గాలి నుంచి హానికర గ్యాస్‌లను పీల్చి, అధికంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దోమలు, క్రిములు, పురుగులను దూరం పెట్టే శక్తి కూడా తులసికి ఉంది. ఇంట్లో తులసి మొక్క ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాక, ఇన్ఫెక్షన్‌లు, వాతావరణ మలినాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఈ ప్రయోజనాలన్నింటికీ తులసి మొక్క ఒకే పరిష్కారం. పెద్దగా ఖర్చు లేకుండా, సులువుగా పెంచగలిగే తులసి, ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క. మన పూర్వీకులు దీనిని గౌరవించడం విన్నపం కాదు… విజ్ఞానం. ఇప్పుడు మళ్ళీ అదే పాఠాన్ని గుర్తుచేసుకునే సమయం ఇది.