న్యూజిలాండ్‌ లో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్!

తాజాగా తెలంగాణలో సంచలనాలకు వేదికైన టీఎస్పీఎస్సీ గ్రూప్ – 1 పేపర్ లీకేజ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయంటే… చేయవా? విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారంటే… చేయరా? వ్యవస్థలంటే ఎంత చిన్న చూపో.. మరెంత ఎంత అలుసో ఈ పేపర్ లీకేజ్ అంశం స్పష్టంగా చెబుతుంది. గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం క్వశ్చన్ పేపర్ వాట్సప్ లలో షేర్ అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం దేశం దాటేసింది. ఖండాలు దాటేసింది. వాట్సప్ లలో షేర్ అయ్యింది. పరీక్షకు ముందు హోటల్ రూం లలో క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకుని ప్రిపేర్ అయ్యే అవకాశాలను కల్పించింది. నచ్చిన కొటేషనో, మెచ్చిన ఫోటోనో షేర్ చేసినట్లు.. తెలంగాణలోని గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ వాట్సప్ లో షేర్ అయిన వ్యవహారం, అది కూడా ఖండాంతరాలు దాటిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును… టీఎస్పీఎస్సీ గ్రూప్–1 పేపర్ దేశం దాటినట్టు సిట్ గుర్తించింది. పేపర్‌ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌ రెడ్డి.. న్యూజిలాండ్ లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌ రెడ్డికి వాట్సాప్‌ లో పేపర్ షేర్‌ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అతడికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశాంత్‌ రెడ్డి హైదారాబాద్ వచ్చి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్‌ వెళ్లిపోవడంతో వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. ఐతే సిట్ నోటీసులకు ప్రశాంత్‌ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.

దీంతో లుకౌట్‌ నోటీసులు ఇష్యూ చేసేందుకు సిట్‌ అధికారులు చర్యలు ప్రారంభించారట. గ్రూప్‌–1, ఏఈ పేపర్‌ సహా ఆరు పేపర్స్ లీకేజీ వివరాలు సేకరించేందుకు నిందితులను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి, ధాక్యా నాయక్‌, రాజేశ్వర్‌ లతోపాటు షమీమ్‌, రమేశ్, సురేశ్ ను ఆరురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్!

పేపర్ల లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈజీఎస్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న అలీపూర్ ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతన్ని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్లో రహస్యంగా గా విచారిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి ఏఈఈ పేపర్ కొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో… టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ న్యూజిలాండ్ వెళ్లడం ఏమిటి..? ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి చదవడం ఏమిటి..? వాళ్లు క్వశ్చన్ పేపర్ వాట్సప్ లలో షేర్ చేసుకోవడం ఏమిటి..? అంటూ తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ విద్యార్థులు – నిరుద్యోగులు!