రాత్రిపూట మహిళా వీఆర్వో ఇంటికి టిఆర్ఎస్ ముత్తిరెడ్డి

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ ఎమ్మెల్యే. ఈయన పేరు చెప్పగానే వివాదాలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా వీఆర్వో ఇంటికి అర్ధరాత్రి వెళ్లి హంగామా చేశారు. జనగామ మండలం పెంబర్తి వీఆర్వోగా పని చేస్తున్న పద్మ జనగాంలోని కుర్మవాడలో నివాసముంటున్నారు. పెంబర్తి సమీపంలోని కోట్ల విలువ చేసే భూమిని తన అనుచరుడికి పట్టా చేయించేందుకు ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారు. శనివారం రాత్రి వేళ తన అనుచరులతో కలిసి వీఆర్వో పద్మ ఇంటికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెళ్లాడు. పట్టా చేయాలని ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే రాత్రిపూట మంది మార్భలంతో రావడంతో ఆమె తీవ్ర భయభ్రాంతులకు గురయ్యి ఈ విషయాన్ని పై అధికారులకు, వీఆర్వోల సంఘం, టిఎన్జీవో ల సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్దమయ్యారు. సంఘటన జరిగినప్పటి నుంచి మహిళా వీఆర్వో అందుబాటులో లేరు. తన ఫోన్ స్విఛ్చాప్ చేసుకున్నారు. వీఆర్వో పద్మ ఇంటికి తాను వెళ్లింది నిజమేనని వెంచర్ పట్టా ఆలస్యం అవుతుండటంతో అడగటానికి వెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంటున్నారు.

గతంలో కూడా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదాలలో ఉన్నాడు. జనగామలోని చెరువును ముత్తిరెడ్డి కబ్జా చేశారని దీనిని ఏకంగా అప్పటి కలెక్టరే బయటపెట్టారు. ఉప్పల్ లో కూడా భూ వివాదంలో ముత్తిరెడ్డి ఉన్నారు.  అధికారులను బెదిరిస్తూ భూ వివాదాలు చేస్తారని ముత్తిరెడ్డి కి పేరుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. సీఎం కేసీఆర్ తయారు చేసిన హిట్ లిస్టు ఎమ్మెల్యే జాబితాలో ముత్తిరెడ్డి పేరు కూడా ఉందని బహిరంగంగానే టిఆర్ ఎస్ నేతలు తెలిపారు. ఎన్నికల ముందు చర్యలు తీసుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ చర్యలు తీసుకోవట్లేదని నేతల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్ రావడం కష్టమేనని వారంటున్నారు.

ముత్తిరెడ్డి అర్ధరాత్రి పూట వీఆర్వో ఇంటికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశమయ్యింది. ఏదైనా ఉంటే ఆఫీసులోనో లేకుంటే ఫోనులోనో మాట్లాడుకోవాలి కానీ ఇలా ఇంటికెళ్లడమేంటని పలువురు చర్చించుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలు ఎటువంటి  నిర్ణయం తీసుకోనున్నారో , ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పనున్నారో అన్న చర్చ జనగామలో హాట్ టాపిక్ గా మారింది.