ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒరిస్సాలో చోటు చేసుకున్న ఈ ఘోర దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. షరామామూలుగానే, రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. రైలు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ఈ తరహా డిమాండ్లు మామూలే.!
అసలు ప్రమాదం ఎందుకు జరిగింది.? ఏ నిర్లక్ష్యం ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమయ్యింది.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది.రైలు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ వినిపించేమాట, అత్యున్నత స్థాయి విచారణ.! విచారణ జరుగుతుంది.. తప్పు ఎక్కడ దొర్లిందో తేలుతుంది. కానీ, గుణపాఠాలు నేర్చుకుంటున్నామా.?
నిత్యం వందల, వేల రైళ్ళు పట్టాల మీద ప్రయాణిస్తున్నాయి. లక్షలాది మంది.. కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. అక్కడక్కడా చిన్నా చితకా ప్రమాదాలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటూనే వుంటాయి. ఒరిస్సా రైలు ప్రమాదం లాంటి ఘోర దుర్ఘటనలు మాత్రం అరుదుగానే జరుగుతాయి.
అపార ప్రాణ నష్టం సంభవించినప్పుడు ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే. సెమీ హై స్పీడ్ రైలు.. వందే భారత్ పట్టాలెక్కాక.. సాధారణ రైళ్ళ గురించిన చర్చ పెద్దగా జరగడంలేదు. నిజానికి, సామాన్యులు ప్రయాణించే రైళ్ళే సాధారణ రైళ్ళు. వాటి మీద ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టం. సాధారణ రైళ్లలో సౌకర్యాల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సాధారణ రైళ్ళలో సాధారణ భోగీల దుస్థితి మరీనూ.! ట్రాక్‌ల నిర్వహణ, రైళ్ళ మరమ్మత్తులు.. వీటన్నిటి విషయంలోనూ ఆత్మవిమర్శ అవసరం. ఘోర ప్రమాదం గురించి కొన్నాళ్ళు మాట్లాడుకోవడం.. రాజకీయ విమర్శలు.. తూతూ మంత్రం చర్యలు.. ఆ తర్వాత అంతా హంబక్.! ఈసారి కూడా అంతేనా.? అంతేనేమో.!
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స.. ఇవే సరిపోవు.! మార్పు రావాలి.! రైల్వేపై ప్రభుత్వ బాధ్యత మరింత పెరగాలి.!