తాజాగా మరోసారి డ్రగ్స్ వ్యవహారం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. పైగా పట్టుబడ్డ వ్యక్తి సినిమా నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఇండస్ట్రీలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో టాలీవుడ్ లో డ్రగ్స్ కోణం మరోసారి చర్చనీయాంశమైంది.
అవును… డ్రగ్స్ విక్రయం కేసులో రజనీకాంత్ “కబాలి” చిత్ర తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కొకైన్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ సమయంలో కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, ఒక కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్ ప్రాంతానికి చెందిన కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) బీటెక్ చదివారు. అనంతరం పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశారు. అనంతరం 2016 లో సినీ రంగంలోకి ఎంటరయ్యారు. ఈ క్రమ్మలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “కబాలి” సినిమా తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సమయంలో పలు తెలుగు తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా కేపీ ప్రసాద్ వ్యవహరించారు. అందులో భాగంగా… సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం తదితర సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అయితే ఈ సినిమా వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో డ్రగ్స్ సరఫరా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది!
ఇందులో భాగంగా గోవాలో పబ్ ను ప్రారంభించిన చౌదరి… హైదరాబాద్ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశారని తెలుస్తుంది. అయితే ఆ వ్యాపారంలో కూడా ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చే ముందు ఒక నైజీరియన్ దగ్గర 100 ప్యాకెట్ల కొకైన్‌ను తీసుకొచ్చారని చెబుతున్నారు పోలీసులు.
వాటిలో కొన్నింటిని తానే వినియోగించిన ఆయన… మిగిలిన వాటిని కిస్మత్ పూర్ క్రాస్ రోడ్డు వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన గాబ్రియేల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.