ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ అడ్డంకులు ఎవరో సృష్టిస్తున్నవి కావు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అడ్డంకులుగా మారుతున్నాయి. ఇప్పటికే అమరావతికి రైతులు ఇచ్చిన భూములను ఇతర ప్రాంతాల్లోని పేదలకు కేటాయించడానికి సర్కార్ సిద్దమవగా హైకోర్టు నో చెప్పింది. స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యధావిధిగా ప్రభుత్వం హైకోర్టు స్టేను నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈమధ్య ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని ఖనిజ, పశువుల మేతకు కేటాయించిన భూముల్లో 1307 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. మైనింగ్ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని అంటూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవి చాలవన్నట్టు తాజాగా భూపంపిణీ కోసం విశాఖ జిల్లా తిరుమలగిరిలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు సంబంధించిన భూములను ప్రభుత్వం సేకరించింది. అవి విద్యా వ్యవస్థల అభివృద్ది కోసం కేటాయించిన భూములని, వాటిని ఇళ్ల పట్టాల కింద పంచడం భావ్యం కాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక లాయర్. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పాఠశాలకు కేటాయించిన భూములను పేదలకు పంచడం కోసం వాడుకోవడం సరికాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది. ఈ ఆదేశాలతో ప్రభుత్వం సేకరించిన భూముల శాతం తరిగిపోతూ వస్తోంది. సర్కార్ 30 లక్షల మందికి పట్టాల పంపిణీ కోసం 26,000 ఎకరాల భూమిని సేకరించే లక్ష్యం పెట్టుకుంది. అందుకే ఎక్కడ ఖాళీగా ప్రభుత్వ భూములు కనిపిస్తే వాటిని పంపిణీకి సేకరించి పెట్టుకుంది.
అలా సేకరించిన భూముల్లోనే మైనింగ్ భూములు, పాఠశాల భూములు ఉన్నాయి. పేదలకు భూములు పంచాలని అనుకోవడం వెనకున్న అసలు కారణం ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడమేనని ప్రభుత్వం అంటోంది. అలాంటి గొప్ప లక్ష్యాన్ని కొందరు దుర్మార్గులు కోర్టుల ద్వారా ఆపుతున్నారని అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. నిజంగా పేదల కోసమే వైసీపీ ప్రభుత్వం ఉచిత స్థలాల పంపిణీ చేస్తామంటే ఎవరూ కాదనరు. కోర్టులు సైతం అభినందిస్తాయి. కానీ ఆ పేరుతో ఖాళీగా ఉన్న భూములను, ఇతర అవసరాల కోసం కేటాయించబడిన భూములను వాడుకుంటామంటేనే ఇలా చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమవుతాయి.
అలాంటప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ముఖ్యం కాదా అని వైసీపీ నేతలు వాదించవచ్చు. ముఖ్యమే.. కానీ సమాజంలోని ఇతర అవసరాలు కూడా ముఖ్యమే కదా. మరి ఒక అవసరానికి కేటాయించిన భూములను ఇతర అవసరానికి వాడటమే ఆమోదయోగ్యం కాదు. పేదల పంపిణీ కోసం భూములు కావాలి అంటే అన్యాక్రాంతంగా ఉన్న ప్రభుత్వ భూములు చాలానే ఉన్నాయి. వాటిని వాడుకోవచ్చు. అలాగే కబ్జా కోరల్లో కూడా చాలా భూమి ఉంది. దాన్ని స్వాధీనపరుచుకుని పట్టాలు ఇవ్వొచ్చు. అవన్నీ కాదు అనుకుంటే బహిరంగ మార్కెట్లో భూమిని కొనుగోలుచేసి పంచవచ్చు. అవేమ చేయకుండా ఇతర ప్రజా అవసరాల కోసం ముఖ్యంగా విద్యా సంస్థల కోసం కేటాయించబడిన భూమిని ఇవ్వడం మంచి పద్దతి కాదు. అలా చేసుకుంటూ పోతే ఈరోజు పాఠశాల భూములు, రేపు ఆసుపత్రి భూములు ఇలా అందుబాటులో ఉన్న ప్రతి భూమిని ఇతర అవసరాల కోసం వాడేసుకోవడం అలవాటుగా మారిపోతుంది.
దీన్నే కోర్టు తప్పుబట్టింది. అలా తప్పుబట్టడంలో తప్పేమీ లేదు. కానీ మొదటి నుండి కోర్టు తీర్పులను తప్పుబడుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ తీర్పును కూడా తప్పుబట్టే ప్రమాదం లేకపోలేదు. పేదలకు మంచి చేస్తాం అంటే కోర్టులు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేసే ఛాన్స్ కూడా ఉంది. అలా చేస్తే అది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుంది. అప్పుడు హైకోర్టు దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసే మంచి పనిని సక్రమమైన రీతిలో, చట్ట ప్రకారం చేస్తే ఎవరూ అడ్డుతగలలేరు కానీ అలా కాకుండా పంచి పెట్టాలి, పేరు తెచ్చుకోవాలి అనే తొందరలో చట్టాలను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తామంటే మాత్రం స్వయంగా తమ పనులకు తామే అడ్డుకట్ట వేసుకున్నట్టు అవుతుంది. పైపెచ్చు సంక్షేమ పథకాల వాయిదాలతో ప్రజల్లో చులకన అవుతారు.