ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌ పై “సింహాద్రి” రీ రిలీజ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో సెకండ్ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్.. “ఖుషి” – “జల్సా”, మహేష్ బాబు.. “ఒక్కడు”, ప్రభాస్.. “వర్షం”, బాలకృష్ణ.. “చెన్నకేశవరెడ్డి” సినిమాలతోపాటు రాం చరణ్.. “ఆరెంజ్” లాంటి సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ రీ-రిలీజ్‌ కు సిద్ధమవుతోంది.

అవును… జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన “సింహాద్రి” సినిమా మరోసారి విడుదల కాబోతుంది. జూనియర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ పై “సింహాద్రి” సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా మూడు వారల సమయం ఉన్నా కూడా… ఇప్పటికే ఐమ్యాక్స్ మెల్‌ బోర్న్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేసింది. ఈ విషయాన్ని ఐమ్యాక్స్ మెల్‌ బోర్న్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“సరిగ్గా 19ఏళ్ల క్రితం.. 19సంవత్సరాల వయసున్న హీరో తెరపైకి వచ్చాడు. నేను ఇక్కడ పాతుకుపోవడానికి వచ్చానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెప్పాడు. అప్పటినుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఆయన మారిపోయాడు. ఇప్పుడు మరోసారి భారీ తెరపైకి ఆయన వస్తున్నాడు… తేదీ రాసిపెట్టు కోండి… మే 20 – 2023” అంటూ ఒక వీడియో ఐమ్యాక్స్ మెల్ బోర్న్ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుంది.

ఐమ్యాక్స్ మెల్‌ బోర్న్‌ లో ఉదయం 9 గంటలకు “సింహాద్రి” షో వేస్తున్నారు. టికెట్ ధర 28 ఆస్ట్రేలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 1533 రూపాయలు గా ఉంది. ఇక ప్రీమియం టికెట్ ధర అయితే 44.50 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే… మన కరెన్సీలో 2,437 రూపాయలు.

కాగా… ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “సింహాద్రి” సినిమా 2003 జూలై 9న విడుదలైన సంగతి తెలిసిందే. అంటే… సరిగ్గా 19 ఏళ్ల తరవాత మళ్లీ రీ-రిలీజ్ అవుతోందన్నమాట!