దేవదాసు సినిమా గురించి తెలియని భారతీయ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు . హిందీ , బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ , అస్సామీ , ఉర్దూ భాషల్లో విడుదలైంది . 1935లో మొదటిసారి దేవదాసు మూకీ లో వచ్చింది . 1936, 1937, 1953, 1955, 1965, 1974, 1979, 1982, 2002, 2009, 2010, 2013, 2017 సంవత్సరాల్లో ఈ సినిమా నిర్మాణమైంది . ఈ సంవత్సరం కూడా దేవదాసు సినిమా నిర్మాణమవుతుంది . హిందీలో దిలీప్ కుమార్ , కె ఎల్ .సైగల్ ,షారుక్ ఖాన్ , బెంగాల్ లో పి .సి .బారువా , సౌమిత్రి ఛటర్జీ , బుల్బుల్ అహ్మద్ , షకీబ్ ఖాన్ , తెలుగు లో అక్కినేని నాగేశ్వర రావు , కృష్ణ నటించారు . 1965, 2010న పాకిస్తాన్లో ఈ సినిమా ను ఉర్దూలో తీశారు , 2013లో బెంగాల్ భాషలో బంగ్లా దేశ్ లో ఈ సినిమా నిర్మించారు .
ఒకే సబ్జెక్టుతో ఇన్ని సార్లు సినిమా తీయడం బహుశా ఇంకెక్కడా జరిగి ఉండక పోవచ్చు . ఇన్ని భాషల్లో , ఇంత మంది మహా నటులు దేవదాసు పాత్రలో నటించారు .తెలుగు తమిళంలో 1953లో వచ్చింది . ఈ రెండు భాషల్లో అక్కినేని నాగేశ్వర రావు నటించాడు . 1974లో హీరో కృష్ణ దేవదాసు గా నటించాడు . విజయ నిర్మల దర్శకత్వం వహించింది . అక్కినేని నాగేశ్వర రావు నటించిన సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించాడు .
కృష్ణ నటించిన దేవదాసు సినిమా విడుదల రోజునే నాగేశ్వర రావు నటించిన దేవదాసు సినిమాను కూడా కావాలనే విడుదల చేశారు . నాగేశ్వర రావు దేవదాసు ఉదయం ఆటల్లో 100 రోజులు నడిచింది . కృష్ణ దేవదాసు ఆశించిన విజయం సాదించలేదు .
హిందీ సినిమా రంగంలో దిలీప్ కుమార్ అగ్రశ్రేణి నటుడు . ట్రాజడీ కింగ్ అంటారు . ఒకానొక సందర్భంలో దిలీప్ కుమార్ హైదరాబాద్ వచ్చి ఓ సభలో పాల్గొన్నాడు . అదే వేదిక మీద అక్కినేని నాగేశ్వర రావు వున్నాడు . దేవదాసు సినిమా గురించి ప్రస్తావిస్తూ , దేవదాసు అనగానే గుర్తు కొచ్చేది అక్కినేని నాగేశ్వర రావు మాత్రమే. . ఆయన తరువాతనే మేమంతా అన్నాడు . నిజమే దేవదాసు సినిమా అనగానే ఎవరికైనా అక్కినేని నాగేశ్వర రావే గుర్తు కోస్తాడు. దేవదాసు పాత్రలో అక్కినేని జీవించాడు అంటారు . విరహ ప్రేమికుడిగా మందుకు బానిసైపోతాడు . ఎప్పుడు త్రాగుతూ ఉంటాడు . ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు నిజంగానే తాగి నటించాడు అనుకునేవారు . తాగకపోతే అంత సహజంగా నటించేవాడు కాదు అని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు .
చాలా సంవత్సరాల క్రితం నాగేశ్వర రావు గారితో ఇదే విషయం ప్రస్తావిస్తే ఆయన పెద్దగా నవ్వేశాడు . నిజ జీవితంలో అక్కినేని రోజు రెండు పెగ్గులు తాగుతాడు . ఆయనకు 1964లో అమెరికాలో గుండె ఆపరేషన్ జరిగింది . డాక్టర్ల సలహా మేరకు ఆయన తాగడం మొదలు పెట్టాడు . అనేక సభల్లో ఈ విషయం అక్కినేని స్వయంగా చెప్పాడు .
ఇక దేవదాసు సినిమా, అందులో తన తాగుడు వ్యవహారం గురించి అక్కినేని చెప్పింది ఏమిటంటే .. ఆ సినిమా షూటింగ్ రాత్రి వేళల్లో జరిగిందట. తాగుబోతు సన్నివేశాలు కూడా అర్థరాత్రి తీసేవారట దర్శకుడు వేదాంతం రాఘవయ్య . . రాత్రి సుష్టుగా భోజనం చెయ్యమని చెప్పేవారట . దర్శకుడు చెప్పినట్టు బాగా భోజనం చేసేవాడట. . షాట్ రెడీ అని చెప్పే సమయానికి నిద్ర తన్నుకుంటూ వచ్చేది. . ఆ నిద్ర కళ్ళతో , ఆ మత్తుతో షూటింగ్ చేసేవారట . అందుకే బాగా మందు కొట్టి నటించినట్టు ఆ సన్నివేశాలు వచ్చాయని ఆ రహస్యాన్ని అక్కినేని నాగేశ్వర రావే స్వయంగా చెప్పారు .