సూర్యాస్తమయం అయ్యాక పొరపాటున ఈ పనులు చేయకండి.. చేస్తే జరిగేది ఇదే..!

హిందూ మతంలో సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవంగా భావించబడతాడు. జీవనానికి శక్తినిచ్చే ఆయనను ప్రతి ఉదయం అర్చన చేసి, అర్ఘ్యం అర్పిస్తే ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతాయని పండితులు చెబుతారు. అయితే అదే సూర్యుడు సాయంత్రం అస్తమించిన తర్వాత కొన్ని పనులు చేయడం కఠినంగా నిషేధించబడింది. ఆ నిబంధనలను అతిక్రమిస్తే జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తరతరాలుగా పెద్దలు కొన్ని పనులు చేయవద్దని చెబుతున్నారు.

సనాతన ధర్మంలో సూర్యాస్తమయం అనేది పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటి తలుపు ద్వారా ప్రవేశిస్తారని విశ్వాసం ఉంది. అందుకే ఈ సమయంలో మన ఇల్లు పవిత్రంగా, సౌమ్యంగా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా చెప్పబడింది. అయితే ఈ వేళ కొన్ని పనులు చేస్తే దేవతల ఆశీర్వాదం దూరమవుతుందని నమ్మకం ఉంది.

అందులో మొదటిది ఇంటి శుభ్రపరిచే పని. సూర్యుడు అస్తమించిన తర్వాత ఊడ్చడం లేదా చెత్తను బయటకు వేయడం శుభప్రదం కాదని చెబుతారు. దీని వల్ల లక్ష్మీదేవి కోపగించి ఆ ఇంటిని వదిలి వెళ్తారని పెద్దల నమ్మకం. అలాగే పవిత్రతకు ప్రతీకగా భావించే తులసి మొక్కను సాయంత్రం తర్వాత తాకరాదు. తులసి ఆకులు కోయకూడదు. ఇది అశుభంగా పరిగణించబడుతుంది. తులసి అమృతస్వరూపిణి కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే సేవించడం శ్రేయస్కరం.

ఇంకో ముఖ్యమైన నిబంధన సాయంత్రం వేళ అస్సలు నిద్రపోకూడదంట. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సమయంలో నిద్రిస్తే వ్యాధులు కలుగుతాయి, ఆయుష్షు కూడా తగ్గుతుందని నమ్మకం. అలాగే ఇంటి ప్రధాన తలుపు మూసివేయకూడదు. ఈ సమయంలో ఇంటి వెనుక తలుపులు మూసినా, ముందు తలుపు తెరవబడి ఉండటం లక్ష్మీదేవి ప్రవేశానికి సూచికగా భావిస్తారు.

అంతేకాకుండా పదునైన వస్తువులను సూర్యాస్తమయం సమయంలో వాడకూడదు. గోర్లు కట్ చేయడం, జుట్టు కట్ చేయడం, దుస్తులు సూదితో కుట్టడం వంటివి దూరంగా ఉంచాలని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఇవి ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తాయని నమ్మకం. వాస్తవానికి ఈ నియమాలు కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే కాదు, జీవనశైలికి అనుగుణంగా కూడా మన పూర్వీకులు అమలు చేశారు. సాయంత్రం సమయాన్ని సంధ్యా సమయంగా పరిగణించి ఆధ్యాత్మిక ఆరాధనలకు, ధ్యానానికి, దీపం వెలిగించడానికి అత్యంత శ్రేష్ఠంగా భావించారు. ఆ సమయాన్ని శుభంగా గడిపితే జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు నిలుస్తాయని విశ్వాసం. (గమనిక: ఈ కథనం పండితులు అందించి సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని మేము ధృవీకరించడం లేదు.)