విడదల రజనీ…జనరల్ మీడియాను చూసే వాళ్ళల్లో ఎవరికైనా ఈమె గురించి తెలియకపోతే తెలీకపోవచ్చు కాని…సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి మాత్రం ఈమె గురించి తెలియకపోయే ఛాన్సే లేదు. కారణం అక్కడ ఈమె హల్ చల్ మామూలుగా ఉండదు. ఈ ఎమ్మెల్యే గారు ఏ పని చేసినా…ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా…ఏ కార్యక్రమం నిర్వహించినా ఆమె అనుచరులు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దుమ్ము లేపుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ట్రెండ్ నాదే అన్నట్లుగా ఎపిలో ఈమె లాగా సోషల్ మీడియాలో ఇంత హవా చూపే ఎమ్మెల్యే మరొకరు ఉండరంటే అతిశయోక్తి. కాదు. అయితే ఇలా జరగడం యాధృచ్చికం కాదని…తాను కోరుకున్న టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఆమె ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారనేది ఆమెంటే గిట్టనివారి మాట…ఇంతకీ ఆమె టార్గెట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటున్నారు.
రాజకీయ ఆరంగ్రేటం ఇలా….
చిలకలూరి పేట ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానం, ఎమ్మెల్యే కావడం వెనుక నేపథ్యం కూడా చాలా ఆసక్తికరం. ఎన్ఆర్ఐ అయిన ఈమె సుమారుగా 2014 లో చిలుకలూరిపేట నియోజకవర్గం కేంద్రంగా చేసుకొని అప్పటి స్థానిక ఎమ్మెల్యే,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. బిసి మహిళగా వచ్చీ రావడంతోనే స్థానిక నేతలను ఆకట్టుకొని వేగంగా ఎదిగారు. అదే క్రమంలో ప్రత్యర్థి పార్టీ అయిన వైసిపిపై, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి,జగన్ పై ఘాటైన విమర్శలతో చెలరేగిపోతూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని సైతం బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తన ప్రథమ లక్ష్యం అయిన ఎమ్మెల్యే సీటు కోసం 2019 ఎన్నికల సందర్భంగా ఏకంగా పుల్లారావునే మీరు ఎంపిగా వెళితే జాతీయ స్థాయిలో ఎదగవచ్చని,తనకు ఎమ్మెల్యేగా అవకాశమివ్వమని అడిగారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఏకంగా చంద్రబాబుతో కూడా ఇదే మాట పుల్లారావుకు చెప్పించారని అంటారు. అయితే పుల్లారావు అందుకు ససేమిరా అనడంతో ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా చంద్రబాబు మిన్నకుండిపోయారని అంటారు.
గురువును మించిన శిష్యురాలు
దీంతో ఎమ్మెల్యే కావాలన్న తన టార్గెట్ రీచ్ అయ్యేందుకు తనకు రాజకీయ ఆరంగ్రేటం చేయించిన పుల్లారావుపైనే తిరుగుబాటు బావుటా ఎగరవేసి వైసిపిలో చేరి 2019 ఎన్నికల్లో ఆయన్నే ఓడించి తాననుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు. దీనికోసం కూడా ఆమె సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకున్నారు. దీంతో ఆమెకు సోషల్ మీడియాపై బాగా గురికుదిరిందంటారు. ఇక ఇంత వేగంగా సినిమాటిక్ గా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతున్న ఈమె పొలిటికల్ జర్నీ అంతా దగ్గరుండి వీక్షిస్తున్న చిలకలూరిపేట స్థానికులు అమ్మో విడుదల రజనీ సామాన్యురాలు కాదుగా అని ముక్కునవేలేసుకునేలా చేశారు. ఫస్ట్ టార్గెట్ సక్సెస్ ఫుల్ గా రీచ్ కాగానే ఈమె తరువాత టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. ఇదిగో ఆ టార్గెట్ రీచ్ అయేందుకే ప్రత్యేక ఫోకస్, టీములు పెట్టి సోషల్ మీడియాను మరింత పవర్ ఫుల్ గా వాడుకుంటున్నారు. ఒక వైపు కార్యక్రమాలు చేపట్టడం,మరోవైపు వాటిని పబ్లిసిటీ చేసుకోవడం వీటితో ఫుల్ జోష్ తో సాగిపోతున్న విడుదల రజనీని చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలంటూ సాక్షాత్తూ జగనే ఎమ్మెల్యేలకు సూచించారని వినికిడి.
సొంత పార్టీ నేతలకే గిట్టడం లేదు
అయితే ఈమె పబ్లిసిటీ తీరో,లేక వ్యవహారశైలి వల్లో కానీ సొంత పార్టీ నేతలకే విడుదల రజని అంటే గిట్టడం లేదట. ఈమెది నర్సరావుపేట లోక్ సభ నియోజకవర్గం పరిధి కాగా ఆ ఎంపినే తనకు చెప్పకుండా నా నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దంటూ ఆయన్ని అడ్డుకొని ఆ వివాదంతో వార్తల్లోకి ఎక్కారు. అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవీతో కూడా ఇలాంటి విషయాలపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈమెని ఏకంగా ప్రధాన మీడియాల్లో సైతం డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ నెగిటివ్ కథనాలు రావడం గమనార్హం. అందులో కూడా సోషల్ మీడియాలో విడదల రజనీ హవానే ప్రముఖంగా ప్రస్తావించారంటే ఆ రకంగా ఈమె ఎంత పాపులర్ అయ్యారో గుర్తించవచ్చు.
ఇదంతా మంత్రి పదవి కోసమేనట
ఎమ్మెల్యే అవ్వాలన్ని తన కోరికను అత్యంత సునాయాసంగా తీర్చేసుకున్న ఈమె తరువాత టార్గెట్ మంత్రి కావడమేననేది ఒక బహిరంగ రహస్యంలా మారిపోయింది. కారణం ఈ విషయాన్ని ఆమె అందరికీ అర్థమయ్యేలా తనకు అచ్చొచ్చిన సోషల్ మీడియలో అన్యాపదేశంగా ప్రచారం చేసుకుంటున్నారు. అలా ప్రచారం చేసుకున్నా దానివల్ల తనకు ఏమీ నష్టం ఉండదని పైపెచ్చు లాభమేనని…ఆ పదవికి తనకంటే బెస్ట్ ఆల్టర్నేట్ ఎవరనేనేది ఈమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. తాను బిసి కులానికి చెందిన మహిళ కాగా ఆమె భర్త మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆరకంగాను ఖచ్చితంగా తనకు కలసివస్తుందనేది ఆమె అంచనా అట. దీంతో రెండో విడత మంత్రి వర్గ విస్తరణ ఈమె మినిస్టర్ కాకుండా ఎవరూ ఆపలేరనే టాక్.
అసలు టార్గెట్ అదేనట.
అయితే విడుదల రజనీ అసలు టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందేనంటున్నారు ఈమె ప్రత్యర్థులు. అందులో నిజమెంతో తెలీదు కానీ ఈమె పోకడలు చూస్తే అలాగే ఉంగాయని వారే ఉదాహరణలతో సహా మరీ వివరిస్తున్నారు. తన నియోజకవర్గం స్థాయి కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఏకంగా రాష్ట్ర స్థాయిలో అమలయ్యే కార్యక్రమాలన్నీ తానే ప్రారంభిస్తున్నట్లు బిల్డప్ ఇస్తారని, సిఎం జగన్ తో చెప్పి తానే వాటిని ప్రారంభింపచేసినట్లు ఆమె చేష్టలు ఉంటాయని ఎద్దేవా చేస్తున్నారు. తన నియోజకవర్గంలో 108 వాహనాలు ప్రారంభించేటప్పుడు వాటిపై రాజశేఖర్ రెడ్డి, సిఎం ఫోటోలు లేకుండా తన ఒక్కరి ఫొటోలే పెట్టి పబ్లిసిటీ చేయడం వంటి విషయాలు ఆమె అసలు టార్గెట్ ఏంటో చెప్పకనేచెబుతుంటాయని అంటున్నారు. అదే నిజమైతే విడదల రజనీయా? మజాకా? అనుకోవాల్సిందే.