తెరపై బీభత్సమైన స్టంట్లు చేసేసినా, రియల్ లైఫ్‌లో రజనీకాంత్‌కి అంత స్టామినా లేదని తేలిపోయింది. వయసు మీద పడ్డంతో బీపీ ఫ్లక్చుయేషన్స్‌ని ఆయన తట్టుకోలేకపోయారు. పైగా, ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ గతంలో జరిగింది. దాంతో, ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. ఆయన తీవ్రంగా ఆందోళన చెందాల్సి వస్తోంది. ‘నాకేం ఫర్లేదు..’ అని ఆయన బయటకు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. కానీ, లోలోపల ఆయన ఆందోళన ఏంటన్నది ఇటీవల తేలిపోయింది. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అన్నాత్తె’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి, కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రజనీకాంత్‌కి. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్, రాజకీయాలు ఎలా చేయగలరు.? పైగా, అధికారంలోకి వచ్చేయాలన్న ఆలోచనతో ఆయన పార్టీ పెట్టబోతున్నారట. అదెలా సాధ్యమవుతుంది.? రాజకీయం అంటే, గతంలోలా లేదు. జనాల్లోకి అగ్రెసివ్‌గా వెళ్ళాలి. ఆవేశపూరిత ప్రసంగాలు చేయాల్సి వుంటుంది. నడవాలి, అవసరమైతే పరిగెత్తాలి.
బస్సుల్లోనూ, కార్లలోనూ, విమానాల్లోనూ, హెలికాప్టర్లలోనూ తిరగాలి. మురికివాడల్లోనూ పర్యటించాలి. ఇన్నీ చేసినా, రాజకీయాల్లో నెగ్గుకురావడం కష్టమేనని ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి. తమిళనాడులో ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులు వుంటాయి రాజకీయంగా. వాటన్నిటినీ తట్టుకోవడం రజనీకాంత్‌కి చాలా చాలా కష్టమే. ‘ఇప్పుడు రాజకీయ ఆలోచనలు అస్సలేమాత్రం చేయొద్దు..’ అంటూ అత్యంత సన్నిహితులు రజనీకాంత్‌కి సూచించారట.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ చేయబోయే రాజకీయ ప్రకటన, జనవరి నెలాఖరున వుంటుందంటూ కొత్త వాదన, రజనీకాంత్ టీమ్ నుంచి బయటకు వచ్చింది. అయితే, ఇది తాత్కాలిక వాయిదా కాదనీ, అలా అలా వాయిదా పడుతూనే వుంటుందనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. హైప్ ఇచ్చి, రాజకీయాలపై తుస్సుమనిపించేయడం రజనీకాంత్‌కి కొత్త కాదు. ఇప్పుడూ అదే జరగబోతోందన్నమాట.