ఒక రాజ్యానికి రాజు కావాల్సివచ్చాడు. అనేకమంది యువకులు మేమంటే మేము అని ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఎవరికి మకుటం ధరింపజేయాలో తోచక వారికి ఒక పరీక్షను పెట్టారు మంత్రులు. ఒక అగ్నిగుండాన్ని సిద్ధం చేసి అందులో ఎవరైతే దూకుతారో వారి మెడలో వరమాల పడుతుందని సెలవిచ్చారు. భయంకరంగా కోరలు చాస్తూ ఎగసిపడుతున్న ఆ అగ్నిగుండంలో దూకడానికి ఎవ్వరూ సాహసించలేదు. కానీ ఒక యువకుడు సాహసించి ఎగిరి గుండంలో దూకాడు. అక్కడ చేరిన జనం అందరూ హాహాకారాలు చేశారు. కానీ, ఆశ్చర్యకరంగా అగ్నిగుండం మొత్తం చల్లారిపోయి ఒక దేవతామూర్తి యువకుడితో పాటు బయటకు వచ్చి అతని మెడలో విరిమాల ధరింపజేసి మాయమైపోయింది.
న్యాయవ్యవస్థ అంటే నిత్యాగ్నిహోత్రం అంత పవిత్రమైనది. వారికి రాజ్యాంగం కల్పించిన రక్షణ అసాధారణమైనది. ఒక ప్రధానమంత్రిని సైతం క్షణంలో మాజీని చెయ్యగలం. ఒక ముఖ్యమంత్రిని నిముషాల్లో జైలుకు పంపించగలం. కానీ ఒక జడ్జీని పదవినుంచి కదిలించాలంటే అది దుస్సాధ్యం. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టి ధైర్యంగా దేశంలో తిరగగలుగుతాము. కానీ ఒక న్యాయమూర్తిని తెలిసి లేదా తెలియక లేదా పొరపాటున దూషించినా మనం ఊచలు లెక్కించాల్సివస్తుంది. అంత కట్టుదిట్టమైన మన వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఏడాదిన్నరగా విశృంఖలంగా వ్యవహరిస్తున్న తీరు చూసి నిశ్చేష్టులం కావడం మినహా ఏమీ చేయలేకపోయాము. న్యాయం, చట్టం మీద అవగాహన లేనివారు సైతం ధర్మాగ్రహాన్ని వ్యక్తపరిచారు. ప్రజాక్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ చర్య తీసుకున్నా వ్యతిరేకించడమే లక్ష్యంగా న్యాయవ్యవస్థ దుర్నీతితో వ్యవహరించింది. ఒక భయానకమైన కుంభకోణానికి కొందరు తెలుగుదేశం నాయకులు, న్యాయమూర్తులు పాల్పడ్డారు అని ఆధారాలతో సహా వెలికితీస్తే అసలు ఆ రిపోర్టునే మూల పడేయాలని ఆదేశించింది. ఒక తాగుబోతు డాక్టర్ నడిరోడ్డుపై బీభత్సాన్ని సృష్టిస్తే అతడిని చట్టప్రకారం అదుపులోకి తీసుకున్న పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్యడమే కాక ఆ పెట్టీ కేసును సీబీఐకు అప్పగించింది.
చాలామంది తెలియక ప్రభుత్వ వాదనలు ఇలా కోర్టులో వీగిపోతుంటే, ప్రభుత్వ అధికారులకు ప్రతిరోజూ మొట్టికాయలు పడుతుంటే, ప్రభుత్వం మీద కోర్టు అక్షింతలు వేస్తుంటే అదంతా ప్రభుత్వ లాయర్ల అసమర్ధత అని భ్రమించారు. కానీ అది వారి అసమర్ధత కాదని, అదంతా ఇచ్ఛాపూర్వకమే అని మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా బహిర్గతమైంది. “ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు గందరగోళంగా ఉన్నాయి….ఇలాంటి తీర్పులను మా జీవితంలో చూడలేదు…జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఆయన ముందుగానే ఒక నిర్ణయానికి ప్రభావితుడై ఉన్నాడు. అందువల్ల ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్స్ అన్నీ నిలిపివేస్తున్నాము ” అంటూ సాక్షాత్తూ ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడంతో హైకోర్టు పరువు నడివీధిన నిలబడింది. గత ఏడాదిన్నరగా పధకం ప్రకారం ఎవరి ఒత్తిడులకో లోనై న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమైపోయింది.
ఇదంతా ఎలా సాధ్యమయింది? జగన్మోహన్ రెడ్డి సాహసం వలన. ఏమైతే అదైందని తెగించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖను రాయడమే కారణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బరితెగించిన అన్యాయవిధానాన్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి నిర్భయంగా దేశం దృష్టికి తీసుకెళ్లడమే రాష్ట్ర హైకోర్టు నిజస్వరూపం బయటపడడానికి కారణం. జగన్ లేఖ మీద సుప్రీమ్ కోర్ట్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చాలామంది పొరపడతారు. అది నిజంగా పొరపాటే. హైకోర్టు దురన్యాయాలను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకోబట్టే ప్రధాన న్యాయమూర్తిని ముగ్గురు జడ్జీలు కలిగిన కొండప్రాంతానికి పంపేశారు. జస్టిస్ రాకేష్ కుమార్ కెరీర్ పదిరోజుల్లో ముగుస్తుందనగా ఆయన జీవితాంతం కుమిలిపోయే వ్యాఖ్యలను రుచి చూడాల్సి వచ్చింది. భూ కుంభకోణం మళ్ళీ తెరుచుకోనుంది. ఇంకా అనేక అద్భుత పరిణామాలను ఆంధ్రప్రదేశ్ చూడబోతోంది.
తన మీద కేసులున్నా, విచారణలు జరుగుతున్నా, ఏమాత్రం భయపడకుండా న్యాయదేవత మీద నమ్మకంతో జగన్ వేసిన ఆ ముందడుగు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. పిల్ల సింహం అయినా సరే…పర్వతమంత ఏనుగు కనిపిస్తే దాని కుంభస్థలం మీదికి ఎగిరి దూకుతుంది. ఎప్పటికైనా వీరులకే విజయం దక్కుతుంది. ఇది మన చరిత్ర, పురాణాలు చెబుతున్న సత్యం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు