Vangaveeti Ranga: కైకలూరులో ఉద్రిక్తత: వంగవీటి రంగా విగ్రహానికి ఘోర అవమానం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గంలో దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి అవమానించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రంగా అభిమానులు, కాపు సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.

కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండల కేంద్రంతో పాటు సమీపంలోని రుద్రవరం గ్రామంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అర్థరాత్రి సమయంలో విగ్రహాలకు పేడ పూసి అపవిత్రం చేశారు. తెల్లవారేసరికి ఈ విషయం తెలియడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబు సీరియస్ – కఠిన చర్యలకు ఆదేశం:
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులను తక్షణమే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

పాలాభిషేకంతో విగ్రహ శుద్ధి చేసిన కామినేని:
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వంగవీటి రంగా అభిమానులతో కలిసి విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇది కేవలం విగ్రహానికి జరిగిన అవమానం కాదు. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి, సమాజంలో అశాంతిని సృష్టించేందుకు జరుగుతున్న కుట్ర. భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదు. నిందితుల వెనుక ఎవరున్నా వదిలిపెట్టం,” అని తీవ్రంగా హెచ్చరించారు.

రంగంలోకి పోలీసులు – ఇద్దరిపై అనుమానం:
సీఎం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, అర్థరాత్రి సుమారు 1:05 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

బానిసలు| Chalasani Srinivas Rao Fires On Chandrababu & Pawan Kalyan Over Vice President Election |TR