“తాయత్తు” వ్యాఖ్యలపై వాయించేస్తున్న టి. కాంగ్రెస్!

తాయత్తు మహిమ వల్లే బ్రతికున్నానంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై అటు నెటిజన్లు, ఇటు టీకాంగ్రెస్ నేతలు ఆన్ లైన్ వేదికగా విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు. దీంతో… డీహెచ్ శ్రీనివాస్ పై పేలుతున్న సెటైర్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది.

ముందుగా ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్… “మరెందుకు ఆలస్యం… ఇక అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లను తొలగించి తాయత్తులు అందుబాటులో ఉంచుతారా? ప్రార్థనలు, పూజలు మొదలుపెడతారా? డీహెచ్ శ్రీనివాస్” అంటూ విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల పేపర్ కటింగ్స్ ని పోస్ట్ చేసింది.

గతంలో… “జీసస్ వల్లే కరోనా తగ్గుముఖం పట్టింది, దేశాభివృద్ధికి క్రైస్తవ్యమే కారణం, మానవ మనుగడకు ఆ మతమే మూలం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్. ఇక మరో సందర్భంలో… “యాదాద్రి నరసింహుడి దయతోనే కోవిడ్ ను ఎదుర్కొన్నాం” అంటు వ్యాఖ్యానించారు.

ఇక అవి సరిపోవన్నట్లు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాట్లాడిన ఆయన…చిన్నతనంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తాను తాయత్తు మహిమ వల్లే బతికానని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయలేని పనిని తాయత్తు చేసిందని చెప్పుకొచ్చారు.

అవును… “నేను పుట్టిన టైం లో అనారోగ్యానికి గురయ్యాను. చావు బతుకుల మధ్య ఉన్నాను. ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు నాకు తాయత్తు కట్టించారు. ఆ తాయత్తు మహిమతోనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా” అంటూ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.